Srinivas Name Persons meets by Get Together in Karimnagar : శ్రీనివాస్ ఈ పేరు తెలుగునాట చాలా కుటుంబాల్లో వినిపిస్తోంది. ఈ పేరు ఉన్నవారంతా ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహానే భలేగా ఉందిగా కదా. మరి ఈ పేరున్నవారంతా ఒకే వేదికపై కలిసి, ఒకరితో ఒకరు భావాలు కలబోసుకునే ఆలోచన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉండే దైవజ్ఞ శ్రీనివాస్‌కు వచ్చింది. దీంతో వెంటనే 'మనమంతా శ్రీనివాసులమే' అని వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో శ్రీనివాస్ పేరు ఉన్న వందల మంది చేరారు. వీరంతా తమ వృత్తి వ్యాపార విషయాలను, సాధకబాధకాలను పంచుకుంటారు. అందరు ఒకటై ఆపదలో ఉన్న స్నేహితులను సైతం ఆదుకుంటారు.
ఇటీవల నుంచి పిల్లలు శ్రీనివాస్ అని పేరు పెట్టుకునే వారు తగ్గుతున్నారని వారంతా గ్రూప్‌లో చర్చించారు. ఈ మేరకు తమ పేరు విశిష్టతను చాటిచెప్పేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు కరీంనగర్‌కు చెందిన వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి రూపాన్నిచ్చారు. 'కరీంనగర్ శ్రీనివాసులం' అనే స్పెషల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమ జిల్లాకు చెందిన శ్రీనివాసులందరూ ఒకటయ్యారు. అలా కరీంనగర్ విద్యానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం శ్రీనివాస్ అని పేరు ఉన్న 150 మంది వరకు చేరుకుని సందడి చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలికరిస్తూ పరిచయం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతాం : వాట్సప్ గ్రూపు ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 200 మందికిపైగా ఆపత్కాలంలో స్పందించి రక్తదానం కూడా చేశారని వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. త్వరలో తలసీమియా బాధితులకు సాయపడాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస్ అనే పేరున్న వేల మందితో సమావేశం నిర్వహించి, ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని వివరించారు.
ఆ గ్రామంలో దేవుళ్లు : మరోవైపు ఎలాంటి వాట్సప్ గ్రూప్ లేకుండా దేవుడు పేరున్న వాళ్లంతా ఒకేచోట ఉన్నారు తెలుసా? రామారావు దేవుడు, సత్య దేవుడు, కృష్ణ దేవుడు, మురళి దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ ఇలా, ఆ ఊళ్లో ఎవరిని పలకరించినా దేవుడు, దేవుడమ్మ అని వినిపిస్తుంది. అలానే పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెంలో తరాలు మారినా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. అక్కడ వంశపార్యం పరంగా వస్తున్న ఆచారమిది. ఈ పల్లెలో సుమారు 2000 మంది ఉంటారు. వారిలో దాదాపు 600 మంది దేవుళ్ల పేర్లు ఉన్నవాళ్లు ఉన్నారు.
ఆ గ్రామంలో దేవుళ్లు - ఒకర్ని పిలిస్తే వంద మంది పలుకుతారు - Devudu Devudamma in Gollupalem