Sri Rama Navami Shobha Yatra In Hyderabad : శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. ధూల్‌పేట్ సీతారాంబాగ్ ప్రాంతంలోని సీతారామ ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై శ్రీరామంటూ నినాదాలు చేస్తున్నారు. వీధులన్నీ భక్తుల రామనామస్మరణతో మార్మోగుతున్నాయి. వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Sri Rama Navami Shobha Yatra Celebrations 2024 : సీతారాంబాగ్ మీదగా బోయిగూడ కమాన్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, జాలీ హనుమాన్, జాలీ హనుమాన్, ధూల్‌పేట్, పూరానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్యంబర్ బజార్, గౌలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి, కోఠి మీదుగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగుస్తుంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు, పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసివేశారు. జీహెచ్ఎంసీ(GHMC), రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను దారి మళ్లించారు. ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ మీదగా మల్లేపల్లి చౌరస్తా, విజయ్‌నగర్ కాలనీ, నాంపల్లి మీదగా మెహిదీపట్నం వైపు మళ్లించారు.
శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకులు : సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ టేక్డీ వరకు శోభాయాత్ర సాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరాముడిని స్తుతిస్తూ పాట పాడారు. వేలాది మంది భక్తులతో శోభాయాత్ర బేగంబజార్‌కు చేరుకుంది. దీంతో అక్కడి వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి. అక్కడికి చేరుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత శోభాయాత్రలో పాల్గొని డీజే పాటలకు నృత్యం చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. భైంసా గోశాల నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రాంలీలా మైదానం వరకు చేరనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.