Special Story On Top Hunter Shafath Ali Khan : క్రూరమృగాలు, మద గజాలు, వన్యప్రాణులు ఇలా ఏవైనా వాటికి హాయిగా జోల (ట్రాంక్విలైజేషన్) పాడేస్తారు హైదరాబాద్ నగరానికి చెందిన షఫత్ అలీఖాన్. సాయం అందించాలంటూ కోరితే చాలు తుపాకీ వేసుకొని వెళ్లిపోయే ఏకైక లైసెన్స్ వేటగాడు ఆయన. ఏసీగార్డ్స్ ప్రాంతానికి చెందిన షఫత్‌ది ఐదేళ్ల ప్రాయం నుంచే తాతతో పాటు తుపాకీ పట్టుకుని వేటకు వెళ్లిన అనుభవం, జంతువుల వైఖరిని పసిగట్టే నైపుణ్యాలు నేర్పాయి. అవే ఇప్పుడు జనాలను కాపాడే ‘మృగరాజు’ను చేశాయి. ప్రెజెంట్ ఉదయ్‌పూర్‌లో పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టన బెట్టుకున్న చిరుతపులిని పట్టుకునే టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఉదయ్‌పూర్‌లో రెస్క్యూ ఆపరేషన్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ ప్రాంతంలో ఓ చిరుత స్థానికులకు, ఫారెస్ట్ ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తోంది. అప్పటికే ఎనిమిది మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అక్కడి అటవీశాఖ చిరుత కనిపిస్తే కాల్చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్స్ ‘షార్ప్ షూటర్’ అయిన అలీఖాన్ సాయం కోరారు. ఇందుకోసం ఆరుగురితో కూడిన షూటర్ల టీంను ఎంపిక చేశారు. అందులో ఫారెస్ట్, పోలీస్, ఆర్మీ సిబ్బంది ఉండగా బయటివారు షఫత్ అలీ మాత్రమే.
పట్టుకోవడమే తొలి ప్రాధాన్యం
సాయం కావాలంటూ ఫోన్‌కాల్ వస్తే వయసు (65)ను లెక్క చేయకుండా తుపాకీ భుజాన వేసుకొని వెంటనే రంగలోకి దిగుతారు. క్రూరమృగాలను పట్టుకోవడమే మొదటి ప్రాధాన్యత అని, చంపడం చివరి అంకమని అలీ చెప్పుకొచ్చారు. బిహార్‌లో 5 మందిని చంపిన గజరాజును చంపాలంటూ ఆ రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీచేస్తే మత్తు ఇచ్చి బంధించి అక్కడి ‘జూ’కి తరలించానన్నారు. ఆ ఏనుగుకు తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.
100కు పైగా ఆపరేషన్లు - లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ సైతం
షఫత్ అలీఖాన్ తాత నవాబ్ సుల్తాన్ అలీఖాన్ బహదూర్ నాటి బ్రిటిష్ దొరలకు వేట సంరక్షకుడిగా, సలహాదారుగా ఉండేవారు. చిన్నప్పటి నుంచే తాతతో కలిసి అడవుల్లోకి వేటకు వెళ్లడం, నేషనల్ లెవల్లో షూటింగ్ ఛాంపియన్ అయి ఉండటమూ ఆయనకు కలిసొచ్చింది. షఫత్ వద్ద ఏపీ, తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్, బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లోని అటవీశాఖ అధికారులు, పశువైద్యులు ట్రైనింగ్ పొందుతుంటారు.
షఫత్ మొదటిసారి తన 19వ ఏట 1976లో కర్ణాటకలోని మైసూర్‌లో వేర్వేరు సమయాల్లో 12 మందిని పొట్టనపెట్టుకున్న మదగజానికి మత్తిచ్చి పడగొట్టారు. కర్ణాటకలోని హెడ్‌డీ కోటలో పులితో ఆయన ‘వేట’ మొదలైంది. అది మొదలు 100కు పైగా ఆపరేషన్లలో పాల్గొని చిరుతలు, పులులు, ఏనుగులను బంధించారు. బిహార్‌లోని వైశాలీ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇటీవల లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సైతం అందుకున్నారు.
వన్యప్రాణుల రక్షణకు అధికారులు స్పెషల్ డ్రైవ్ - "క్యాచ్ ద ట్రాప్" పేరుతో కార్యక్రమం
అది నిఘా రాబందు అని అనుమానం - ఎట్టకేలకు పట్టుకున్న అటవీ అధికారులు - Forest Officials Found Hawk