Special Story On Hyderabad Rifle Pistol Shooter Girls : రైఫిల్ షూటింగులో బుల్లెట్‌లా దూసుకెళుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే అనేలా పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో సాధన చేస్తున్నారు. ఉత్తమ ప్రతిభ చాటుతూ బంగారు పతకాలు సాధిస్తున్నారు. తల్లిదండ్రులకు కీర్తి ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. నిర్దేశించుకున్న ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ప్రణాళిక రూపొందించుకొని అడుగులు వేస్తున్న ఈ క్రీడాకారిణులు.
వీరి పేర్లు భూక్య సోనాలిసా, మోనాలిసా. తల్లిదండ్రులు భిక్షపతి నాయక్, తిరుమల. స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్. ప్రస్తుతం హైదరాబాద్ శివారు బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి రైఫిల్, పిస్టోల్ షూటింగ్‌లో ఆసక్తి కనబరుస్తుంటే చూసి స్ఫూర్తి పొందారు ఈ అక్కాచెల్లెళ్లు. ఒకరు పదేళ్ల వయస్సు నుంచి మరొకరు నాలుగేళ్ల వయస్సు నుంచి సికింద్రాబాద్‌లోని ఏఐమ్ ఎయిర్‌గన్ అరెనా ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు.
పసిడి పతకాలు : పాఠశాల అయిపోగానే శిక్షణ కేంద్రానికి వెళ్లి సాధన చేస్తున్నారు ఈ క్రీడాకారులు. శిక్షణలో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శిస్తూ సొంత మార్క్ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అదరగొట్టారు. ఎయిర్‌గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 10వ జాతీయ రైఫిల్, పిస్తోలు షూటింగ్ ఛాంపియన్‌షిప్-2024 పోటీలు జరిగాయి. గోవాలో జరిగిన ఈ పోటీల్లో పసిడి పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ క్రీడాకారులు.
షూటింగ్‌లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు : అండర్ 17 విభాగంలో సోనాలిసా, అండర్ 12 కేటగిరీలో మోనాలిసా బంగారు పతకాలు సాధించారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి 700 మంది విద్యార్థులు ఈ జాతీయ పోటీలకు హాజరు కాగా అత్యుత్తమ నైపుణ్యంతో సత్తాచాటారు ఈ తెలుగుతేజాలు. జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో 2 బంగారు పతకాలు, అంతర్ రాష్ట్ర స్కూల్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఒక బంగారు పతకం సాధించిన రికార్డు సొంతం సాధించింది సోనాలిసా. ఆటల్లో ఈ అమ్మాయిలు సాధించిన విజయం గురించి తెలిసి తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా వెళ్లి కలిశారు. ఈ ఛాంపియన్‌షిప్ విజేతలను సచివాలయంకు తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కల్పించారు. రైఫిల్, పిస్తోల్ క్రీడలో జాతీయ స్థాయి ప్రతిభ కనబర్చిన ఈ ఇద్దరిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. పట్టుదలతో మరింత ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలంటూ ప్రోత్సహించారు.
తాజాగా అంతర్జాతీయ రైఫిల్, పిస్టల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు ఈ అక్కా చెల్లెళ్లు. ఈ నెలాఖరులో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు థాయిలాండ్ వెళ్లేందుకు సన్నద్ధం అవుతూ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. స్కూల్, సాధన రెండింటినీ సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అండర్ 12 విభాగం జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందని మోనాలిసా చెబుతోంది.
ఒలింపిక్స్ పోటీలే లక్ష్యంగా : తాము అనుకుని సాధించలేని లక్ష్యాన్ని కుమార్తెలు సాధిస్తుండడం గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. కష్టపడి అనతికాలంలోనే జాతీయ స్థాయిలో సత్తాచాటడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. వీళ్లకి సరైన సౌకర్యాలు, శిక్షణ అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కోచ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒలింపిక్స్ పోటీలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈ క్రీడాకారిణిలు. పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందిస్తే అత్యాధునిక రైఫిల్, పిస్తోల్ షూటర్స్, టార్గెట్ సెట్టింగ్స్‌తో మరింత సాధన చేసి అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటుతాం అంటున్నారు. చదువుల్లో రాణించి భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్త , వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఉందని ఆ దిశగానూ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు.