Special Story On Brain Stroke And Major Causes And Characteristics : పక్షవాతం కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా వయసు పై బడిన వారికి వచ్చే బ్రెయిన్‌స్ట్రోక్ ప్రమాదాలు చిన్న వయసులో ఉన్న వారినీ భయపెడుతున్నాయి. మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి వచ్చే ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ (Ischemic Brain Stroke) కేసులు 85% వరకు నమోదవుతున్నాయి. మెదడు నాళాలు చిట్లి రక్త స్రావమయ్యే హేమరేజిక్ కేసులు (Hemorrhagic cases) మిగిలిన 15% ఉంటున్నాయి. మెదడు రక్తనాళంలో ఏర్పడే గడ్డను కరిగించే మందులను నాలుగున్నర గంటల్లోపే ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. అక్టోబరు 29వ తేదీ ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్‌డే సందర్భంగా మన రాష్ట్రంలో ఈ కేసుల పరిస్థితి గురించి వివరంగా తెలుసుకుందాం!
లక్షణాలివి :
- శరీరంలో ఒకవైపు పట్టు తప్పడం.
- మాటలు తడబడటం, స్థిమితంగా లేకపోవటం, చూపు మందగించడం
- ముఖం పాలిపోవడం, కాళ్లు చేతులకు తిమ్మిర్లు.
- తీవ్ర తలనొప్పి, నిస్త్రాణంగా మారడం.
- ఈ లక్షణాలలో ఏవి కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. ఈ లక్షణాలు మొదలైన నాలుగున్నర గంటల్లోపే కీలకమైన మందులను ఇవ్వగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పక్షవాతానికి ప్రధాన కారణాలు :
- పొగ తాగడం, అతిగా మద్యం సేవించడం.
- జర్దా, గుట్కా, ఖైనీ నమలటం.
- అనారోగ్యకర అలవాట్లు.. ఉప్పు, తీపి పదార్థాలను మితిమీరి తినడం.
- సరైన వ్యాయామం లేకపోవడం.
- ఆరోగ్య పరీక్షలు సక్రమంగా చేయించుకోకపోవడం.
- కుటుంబంలో ఎవరికైనా మెదడు సంబంధిత జబ్బులు ఉండటం.
ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు : పక్షవాతానికి గురై చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడ్డ వారిలో 30% మంది వరకు తిరిగి బాధితులవుతుండటం గమనార్హం. వైద్యుల సూచనల మేరకు మందులు వాడకపోవడం, సలహాలు పాటించకపోవడంవంటి ప్రధాన కారణాలతో వారు మంచాలకే పరిమితమవుతున్నారు. 2014లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కింద హెమరేజిక్, ఇస్కీమిక్ బ్రెయిన్‌స్ట్రోక్ కేసులు 9,564 నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 15 వేల వరకు కేసులు నమోదు అయ్యాయి. అవే కాకుండా నేరుగా హస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.
పక్షవాతానికి గురయ్యేవారిలో చాలా మందికి సరైన ఆహార అలవాట్లు లేకపోవడాన్ని గుర్తించాం. జన్యుపరమైన కారణాలతో కొందరు చిన్న వయసులోనే బాధితులవుతున్నారు. మన దేశంలో 13% మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. గుంటూరులో మేము చికిత్స అందించిన 1000 మంది పక్షవాత రోగుల ఆరోగ్య వివరాలు పరిశీలించగా 69 శాతం మందికి రక్తపోటు, 38 శాతం మందికి మధుమేహం ఉంది. గతంలోనే పక్షవాతం బారినపడ్డవారు 5 శాతం ఉన్నట్లు తేలింది. 100 మందిలో 77 శాతం ఇస్కీమిక్, 23 శాతం హెమరేజిక్ స్ట్రోక్‌కు గురయ్యారు - డాక్టర్ పి.విజయ,న్యూరాలజిస్ట్, గుంటూరు
యుక్తవయసులోనూ : ఆరోగ్యశ్రీ కింద బ్రెయిన్‌స్ట్రోక్ చికిత్స పొందే వారిలో ఏడాదికి సగటున 20 ఏళ్ల లోపువారు ఒక శాతం, 20 నుంచి 40 ఏళ్లవారు 9%, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారు 44%, 60 ఏళ్ల పైబడినవారు 50శాతం మంది ఉంటున్నారని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీశ తెలిపారు. మగవారిలో ఇప్పటివరకు 63% మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తో చికిత్స పొందారని వివరించారు. విజయవాడ జీజీహెచ్‌లో వారానికి ఐదుగురు పక్షవాతంతో చేరుతున్నారని న్యూరాలజీ నిపుణురాలు డా. మాధవి తెలిపారు.
పక్షవాత బాధితులు కొందరికి వెంటిలేటర్‌పైనా చికిత్స అందించాల్సి వస్తోంది. అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తున్నందున వ్యాధి నిర్ధారించగానే సర్జరీలు చేస్తున్నాం. 1990తో పోల్చితే సర్జరీ కేసులు ఇప్పుడు పెరిగాయి. అత్యవసర వైద్యాన్ని అందించాల్సిన కేసుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. లక్షణాలకు అనుగుణంగా బ్రెయిన్‌స్ట్రోక్ గుర్తించడం, చికిత్స అనంతరం జాగ్రత్తలపై రోగులను చైతన్యపరుస్తున్నాం-డాక్టర్ బి.హయగ్రీవరావు,న్యూరోసర్జన్, విశాఖ కేజీహెచ్
ఈ పొరపాట్లు చేస్తున్నారా? - బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు ఉన్నట్టే!