Special Police force For Hydra : చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చెరువులను కబ్జా చేసిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలిస్తూ కూల్చివేయిస్తున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు వేగవంతం కానున్నాయి.
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది.