Special Health Centre for Mental Problems: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ వేధిస్తోన్న సమస్య మానసిక కుంగుబాటు. దీపికా పదుకునే, సమంత వంటి స్టార్ హీరోయిన్లు సైతం దీని బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 కోట్ల మందికి పైగా ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. ఇక యాంగ్జయిటీ డిజార్డర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శారీరక, అనారోగ్య సమస్యలతో ఒక వ్యక్తి మాత్రమే ఇబ్బంది పడితే అదే మానసిక సమస్య తలెత్తితే కుటుంబం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఈ సునిశిత సమస్యను దశాబ్దాన్నర క్రితమే గమనించారు గుంటూరుకు చెందిన డాక్టర్ ఖలీల్. ఆయన 1989లో గుంటూరు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి 2000లో బ్రిటన్‌లో సైకియాట్రీలో పీజీ పట్టా అందుకున్నారు. లండన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌గా 27 ఏళ్లు సుదీర్ఘంగా పనిచేశారు. స్వదేశం రుణం తీర్చుకోవాలని, పుట్టి పెరిగిన ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలందించాలని 2010లో భారత్‌కు తిరిగి వచ్చేశారు. అదే ఏడాది మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. ఎంపవర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
బిడ్డ మనసును.. అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు!
మానసిక సమస్యలను రోగాలుగా కూడా చూడని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ తరఫున ఖలీల్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. లండన్ లో వైద్యులుగా మంచి ఆదాయాన్ని వదులుకుని వచ్చిన ఖలీల్ ఎలాంటి ఆదాయం రాకపోయినా దాతలు, తోటి వైద్యుల సహకారంతో 14 ఏళ్లుగా మహాత్మాగాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ నిర్వహణలో డాక్టర్ ఖలీల్‌కు ఆశా ఆవుల, ఇతర వైద్యులు చక్కటి తోడ్పాటు అందిస్తున్నారు. నిద్ర సమస్యలు - స్వీయ సహాయం, మానసిక కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ – ఉన్మాద వ్యాధి, స్కిజోఫ్రీనియా, డిమెన్షియా, మద్యానికి బానిసగా మారడం, పొగ తాగడం, దంపతుల సమస్యలు వంటి మానసిక సమస్యలకు ఉత్తమ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. 2010 ప్రారంభం నుంచి అద్దె భవనాల్లో అనేక సమస్యలతో సావాసం చేస్తూ సంస్థను నడిపిస్తున్న డాక్టర్ ఖలీల్ బృందం దాతల సహకారంతో ఇటీవలే గుంటూరు కొత్తపేటలో సొంత భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ఈ నూతన భవనాన్నిప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రారంభించారు. మానసిక వైద్యంతో పాటు షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి శారీరిక సమస్యలకూ సేవల్ని విస్తరిస్తూ సంస్థ పేరును మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థగా మార్చారు. చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడిన వారు తమకు నచ్చిన రీతిలో విరాళాలు ఇస్తే ఆసుపత్రి నిర్వహణ కోసం స్వీకరిస్తున్నారు.
SAMANTHA ON MENTAL HEALTH: 'జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా'