Mudasarlova Railway Zone : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అడుగులు పడుతున్నాయి. జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో కీలక ప్రాజెక్టుల మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రైల్వే జోన్‌కు సంబంధించిన భూములు అప్పగించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ జోరందుకుంది.
New Railway Zone in Vizag : విశాఖ నగరంలోని చినగదిలి పరిధి ముడసర్లోవ వద్ద గతంలో రైల్వేకు కేటాయించిన భూములను జీవీఎంసీ, రైల్వే అధికారులు పరిశీలించారు. 52 ఎకరాల వాస్తవ స్థితిని పరిశీలించి హద్దులు నిర్ణయించారు. ఇందులో ఎటువంటి ఆక్రమణలు లేవని గుర్తించి జీవీఎంసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీన్ని త్వరలోనే రైల్వేకు పంపించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
రైల్వే అధికారులు ఆ స్థలాన్ని తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నారు. కానీ వివాదాలను పూర్తిస్థాయిలో పరిష్కరించి అప్పగించాలని వారు కోరుతున్నారు. గతంలో ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. వారందర్నీ ఖాళీ చేయించారు. అప్పట్లో రైల్వే అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లారు. దీంతో వారి మీదే కేసులు పెట్టారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పూర్తిహక్కులతో, ప్రహరీ నిర్మించి స్థలాన్ని అప్పగించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. ఈ స్థలంపై తొలుత రైల్వే కొంత విముఖత చూపింది. అయితే ప్రత్యామ్నాయ స్థలాలు విశాఖకు దూరంగా ఉండటం, జోన్ కార్యాలయం విశాఖకు దూరంగా ఉంటే బాగోదన్న ఉద్దేశంతో ముడసర్లోవలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
విశాఖ రైల్వేకు స్థలాన్ని కేటాయించాం : కలెక్టర్ మల్లికార్జున