Some Political Parties Fire on YS Jagan Tirumala Tour : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెనుదుమారం రేగిన వేళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన అనగానే రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల రావడాన్ని తాము స్వాగతించామని, అయితే డిక్లరేషన్ పై సంతకం చేసే తిరుమలలో ప్రవేశించాలని డిమాండ్ చేశారు.
జగన్ హిందువా? క్రిస్టియనా? : జగన్ తిరుమల పర్యటనపై ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ అటు హిందువులను, ఇటు క్రిస్టీయన్లను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఓదార్పు యాత్ర చేసే సమయంలోనే మొదటిసారి తిరుమలకు వచ్చిన జగన్, తరువాత ఎప్పుడైనా కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్ది హిందువా? క్రిస్టియనా? అన్నది అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి తాత వైఎస్ వెంకటరెడ్డి 1925లో క్రైస్తవుడుగా మారారని, రాజశేఖర్ రెడ్ది తల్లి జయమ్మ, జగన్ తల్లి విజయమ్మలు క్రైస్తవులేనని చెప్పారు. వైఎస్ విమలమ్మ ఆత్మకతలో వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడని రాసినట్లు తెలిపారు.
రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్ : జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందన్నారు. ‘‘రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’’ అని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీది కల్తీ రాజకీయాలు : డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ మోహన్ రెడ్డి తిరుమల దర్శనం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీది కల్తీ రాజకీయాలని విమర్శించారు. స్వామివారి పవిత్రమైన లడ్డు ప్రసాదంలోనూ కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. అలాగే మాజీ స్పీకర్ సీతారాం కల్తీ నెయ్యిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగాదని హెచ్చరించారు.
అప్పుడు జగన్‌నూ ఎవ్వరూ ప్రశ్నించ లేదు : డిక్లరేషన్‌పై సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లకు గండి పడుతుందని జగన్ భయపడుతున్నారని టీడీపీ నేత రుద్రరాజు పద్మరాజు ధ్వజమెత్తారు. ఏ మతస్తుడైనా తిరుమల వెంకన్నను దర్శించుకోవచ్చు, కానీ డిక్లరేష్పై సంతకం చేయాలన్నారు. డిక్లరేషనుపై సంతకం చేస్తేనే హిందూ మతాన్ని జగన్ గౌరవించినట్లు అని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ డిక్లరేషనుపై సంతకం చేయలేదని, ఆ రోజు జగన్‌నూ ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు అప్పట్లో జగన్‌ను ప్రశ్నించలేకపోయారని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిందని డిక్లరేషన్ విషయంలో జగన్ ఇష్టానుసారంగా వ్యవహరించలేరని తెల్చిచెప్పారు. డిక్లరేషన్ చేయకుండా దర్శనానికి వెళ్తే స్వామి దర్శనానికి జగన్ అనర్హుడని తెలిపారు. తిరుమల లడ్డూకు జగన్ కళంకం తెచ్చారని మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ తిరుమలకు సతీ సమేతంగా వెళ్లలేదని దుయ్యబట్టారు.
జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour