Situation of Universities at Amaravati : వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి ఇప్పుడు సత్వర ఉపశమనం కోసం ఎదురు చూస్తోంది. జగన్ జమానాలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడిన ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కోరుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వానికి అవసరమైన మేర సహకరిస్తామని భరోసా ఇస్తున్నాయి.
సరైన రోడ్డు లేక విద్యార్థుల ఆందోళనలు : అడుగడుగునా గుంతలు, కంకర తేలి కనిపిస్తున్న ఈ రహదారులు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని వచ్చిన ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు గత ప్రభుత్వం ఇచ్చిన బహుమానాలు! ఇవేకాదు అమరావతిలో అంతర్గత రోడ్లన్నింటినీ గాలికొదిలేశారు. చాలాచోట్ల రహదారులను అడ్డగోలుగా పెరిగిన కంపచెట్లు మూసేశాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన సంస్థలు సైతం అమరావతిలో అంతర్గత రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తంచేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజధాని పరిధిలో కేంద్రం నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక విద్యార్థులు ఆందోళనలు చేసిన పరిస్థితి.
అమరావతి వైభవం-విలసిల్లాలి నలుదిశలా! అదే చంద్రన్న ఆన - cm chandrababu visiting amaravati
విద్యార్థుల ఒళ్లు హూనం : అమరావతి విట్‌లో 10 వేల మంది, ఎస్ఆర్ఎమ్లో 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ యూనివర్శిటీలు వసతి కల్పించలేకపోవడంతో విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థుల ఒళ్లు హూనం అవుతోంది. అమరావతిలో మౌళిక వసతులు సరిగా లేక విస్తరణ విషయంలో అచితూచి అడుగులు వేసిన యూనివర్శిటీల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త భవనాల నిర్మాణానికి పూనుకున్నాయి. పనులూ వేగంగా జరుగుతున్నాయి.
అమరావతిలో యూనివర్శిటీలకు మొదటి విడతలో వంద ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. వాటిలో నిర్మాణాలు పూర్తయితే మరో 100 ఎకరాలు ఇస్తామని అన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి అనుగుణంగా తమ విద్యాసంస్థలను విస్తరించుకుంటూ పోతామని యాజమాన్యాలు చెప్తున్నాయి.
గత ఐదారేళ్లలో యూనివర్సిటీల పరిసరాల్లో అభివృద్ధి ఆశించినంత వేగంగా జరగలేదు. కొత్త ప్రభుత్వం రాజధానిలోని అన్ని వర్సిటీ క్యాంపస్‌లకు వెళ్లే ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తుందని నమ్మకంతో ఉన్నాం. అంటే,వచ్చిపోయేందుకు వీలుగా మంచి రోడ్లు, పరిసరాల పరిశుభ్రత, క్యాంపస్‌లకు మంచి నీరు, విద్యుత్ సరఫరా వంటివన్నీ చేయాలి. ఇప్పుడున్నవన్నీ నామమాత్రంగా చేసినవే. కానీ ఇలాంటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇది జరిగితే మా వైపునుంచి మేం చేయాల్సిందంతా చేస్తాం. మనోజ్ అరోరా, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఉపకులపతి
విశ్వవిద్యాలయాల్లో కేవలం బోధన మాత్రమే కాకుండా సదస్సులు, విద్యా సమ్మేళనాలు నిర్వహించి, దేశ, విదేశీ ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు. మౌలిక వసతులు సరిగా ఉంటే జాతీయ, అంతర్జాతీయ సదస్సులూ ఈ క్యాంపస్‌లలో నిర్వహించే అవకాశం ఉంటుంది.