SIT Officials Started Investigation In Palnadu and Tirupati Districts : పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతిలో విచారణ చేపట్టింది. అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఎఫ్ఐఆర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో పరిశీలించారు. సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్సై, సీఐలను విచారించారు.
మాజీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు! - ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా?
చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లిలో విచారణ చేపట్టారు. పోలింగ్ తర్వాత కూచివారిపాలెంలో చోటు చేసుకున్న ఘటనలపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. తర్వాత రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్‌ను విచారించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తానని సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుస్తామని, ప్రతి ఎఫ్ఐఆర్నూ పరిశీలిస్తానని చెప్పారు.
పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రగిరి మండలం కూచివారిపల్లె గ్రామస్ధులపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి పాల్పడిన దృశ్యాలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మురళీధర్ ప్రదర్శించారు. ఓటు వేసేందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై దాడి చేయడంతో పాటు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అతని సోదరుడు హర్షిత్ రెడ్డి తమ అనుచరగణంతో గ్రామంపై దండెత్తారని వాపోయారు. హర్షిత్ రెడ్డి అనుచరులతో వస్తున్న దృశ్యాల్ని మురళీధర్ ప్రదర్శించారు. గ్రామంపై దాడిచేసిన దృశ్యాలు, అక్రమ కేసుల వివరాలను ఆధారాలతో సహ సిట్‌కు వివరిస్తామని మురళీధర్ స్పష్టం చేశారు.
ఎన్నికల హింసపై విచారణ చేపట్టిన సిట్ బృందాలు - ఎవరి పాత్రేంటో తేల్చే పనిలో నిమగ్నమైన అధికారులు
ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలోని వీడియోలను పరిశీలించారు. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది.