Sister Killed Brothers in Palnadu : నేటి సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా డబ్బుకోసం ఓ తోబట్టువు, అన్నను, తమ్ముడిని హతమార్చింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆ వ్యక్తి పక్షవాతంతో మరణించాడు. ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. ఇన్నాళ్లు అనారోగ్యంతో ఉన్న నాన్నను తానే చూసుకున్నందునా ఆ డబ్బు తనకే దక్కాలనే దురాశతో సోదరి ఏకంగా అన్న, తమ్ముడిని ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే మృతదేహాలు లభించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు(50)కు ముగ్గురు పిల్లలు. భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో ఈ సంవత్సరం జనవరిలో చనిపోయారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి. పెళ్లై భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణ. కుమారులిద్దరికీ వివాహాలయ్యాయి. కానీ వీరిని భార్యలు వదిలి పుట్టిళ్లకు వెళ్లిపోయారు. ముగ్గురు కూడా వాళ్ల జీవిత భాగస్వాములను వదిలిపెట్టేశారు.
అయితే నిందితురాలికి నకరికల్లులో ప్రియుడు ఉన్నట్లు తెలిసింది. కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. కొన్ని రోజులుగా గోపీకృష్ణ బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌లో విధులకు హాజరుకావడం లేదు. బండ్లమోటు ఎస్సై బాలకృష్ణ మెమో కూడా జారీ చేశారు. అయినా అటు నుంచి సమాధానం రాలేదు. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో ఈ నెల 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సోదరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తమ్ముడిని నవంబర్ 26న కాల్వలో పడేసి చంపినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డబ్బు కోసం హత్యలు - తెలిసిన వాళ్లే మహిళల ముఠా టార్గెట్ - Murders by Womens Gang