RS.10 Rupees Tiffin Centre in Hyderabad : రూ.10కి నాణ్యమైన మంచి నీరు కూడా ఈ రోజుల్లో దొరికే పరిస్థితి లేదు. దొరకని రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో రూ.10కే నాణ్యమైన అల్పాహారం, అది కూడా హైదరాబాద్ మహానగరంలో అంటే మాటలు కాదు. కానీ ఈ యువకుడు ఆ ఆలోచనను నిజం చేసి రోజు వందలాది మంది కడుపు నింపుతున్నాడు. కష్టం నుంచి వచ్చిన వ్యాపార ఆలోచనను సామాన్యుడికి మేలు చేకూరేలా మలిచి సక్సెస్ అవుతున్నాడీ యువకుడు.
ఇతని పేరు శివకుమార్. స్వస్థలం గుంటూరు. చిన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోవడంతో అమ్మే అన్నీతానై చూసుకుంది. తల్లికి తోడుగా ఉండేందుకు ఒక పూట బడికి, ఒక పూట పనికి వెళ్లేవాడు. ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతిలోనే చదువు మానేశాడు. ప్రవృత్తిగా మొదలు పెట్టిన పాటలనే కెరీర్‌గా పెట్టుకున్నాడు. అయితే తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులున్న పరిస్థితుల్లో సంగీత శిక్షణ పొందడం అసాధ్యం అనిపించింది. తల్లే గురువుగా పాటలు పాడటం నేర్చుకున్నాడు ఈ ఔత్సాహికుడు.
నాణ్యమైన ఆహారం తక్కువ ధరకే : ఎంచుకున్న లక్ష్యం ఒకవైపు, ఆర్థిక పరిస్థితులు మరోవైపు ఇబ్బందులు పెడుతుంటే, బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు శివకుమార్. దొరికిన పని చేసి పరిచయాలు పెంచుకున్నాడు. చివరికు ఈటీవీ నిర్వహించిన పాడుతా తీయగా పోటీల్లో పాల్గొన్నాడు. చక్కగా రాణించి పోటీల్లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే పాటలతో గుర్తింపు సంపాదించాలనుకున్న తనకు ఆకలి కొత్త మార్గం చూపిందని అంటున్నాడు శివకుమార్. ఉపాధి కోసం తనలా రోజూ వందల మంది హైదరాబాద్‌కు వస్తారు. ఏ పని దొరక్క తినడానికి డబ్బులు లేక నానా అగచాట్లు పడుతుంటారు. వారందరికీ నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తే ప్రయోజనం చేకూరుతుందని భావించాడు.
అలా ఉద్భవించిందే ఈ రూ.10ల టిఫిన్ సెంటర్. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంతో మంది కడుపులు నింపుతోంది. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఉదయాన్నే ఉద్యోగం, కళాశాల అంటూ హడావుడిగా వెళ్లే వారు టిఫిన్ సిద్ధం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. పోనీ హోటల్‌లో తీసుకెళ్దాం అంటే కనీసం రూ.40 లేనిదే ఏం దొరకదు. ఇక బ్యాచిలర్ బాబుల కష్టాలు మామూలే. తల్లిదండ్రులు పంపే కాసిన్ని డబ్బులు పొదుపుగా వాడుకోవాలి.
10 రూపాయలకే లాభాపేక్ష లేకుండా అల్పాహారం : దీంతో ఇంట్లో టిఫిన్ చేసుకోలేరు. అలాగని అన్ని డబ్బులు పెట్టి బయటా కొనలేరు. ఇలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకునే చవక ధరకే నాణ్యమైన అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు శివ కుమార్. ఎవరూ ఉహించనంత తక్కువ ధరలో రూ.10కే టిఫిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాడు శివకుమార్. ఇంటి రుచికి ఏ మాత్రం తీసిపోకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా అమ్ముతున్నారు. ఏది తిన్నా అదే ధర. దిల్‌సుఖ్‌నగర్‌లో ఈ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాక స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
హైదరాబాద్ మొత్తంలో 4 చోట్ల శివకుమార్ బ్రాంచీలు ఏర్పాటు చేసి, 30 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాడు. అయితే ఎన్నటికైనా టాప్ సింగర్ అవ్వాలని, తన టిఫిన్ సెంటర్ ద్వారా చవక ధరలకే 3 పూటలా నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నానని చెబుతున్నాడు. తనలా మరెవ్వరూ ఆహారం దొరక్క పస్తులుండకూడదని ఆలోచించి, ఇలా రూ.10కే లాభాపేక్ష లేకుండా అల్పాహారం అందిస్తున్నాడు శివకుమార్. ధర తక్కువతో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో కస్టమర్ల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయంటున్నాడు. త్వరలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తారిస్తానంటున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.
'2014లో ఈటీవీ నిర్వహించిన పాడుతా తీయగా పోటీల్లో పాల్గొనాలని లక్ష్యం పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చా. అందులోనే చక్కగా రాణించి పోటీల్లో రన్నరప్‌గా నిలిచా. అందరికీ నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించాలని అనుకున్నా.' - శివకుమార్, ఎస్వీ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు