Vacancies in Engineering Dept : ప్రభుత్వానికి అత్యంత పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చే ప్రధానమైన శాఖల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఒకటి. ఆదిలాబాద్- నిర్మల్ జిల్లాలతో కలిపి ఉన్న పంచాయతీరాజ్ సర్కిల్లో అసిస్టెంట్, డివిజన్ ఇంజినీర్లతో కలిపి మొత్తం 41 పోస్టులను ఇంఛార్జీలతో నెట్టుకురావాల్సి వస్తోంది. వందలకోట్ల నిధులతో చేపట్టే రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భవనాలతో పాటు, వివిధ కార్యక్రమాల నిర్వహణపై పర్యవేక్షణ లేకుండా పోతోంది.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 34 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రెండేళ్ల కిందట 5కోట్ల 18 లక్షలు కేటాయించింది. ఇప్పటికే మరమ్మతులు పూర్తిచేసి వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాల్సి ఉన్నా, పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని పనులను, సర్కార్ పంచాయతీరాజ్ విభాగానికి అప్పగిస్తోంది.
టెండర్ ప్రక్రియంతా ఆన్లైన్లో జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణను పర్యవేక్షించే వ్యవస్థలేకపోవడంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ఖాళీల విషయాన్ని బయటపెట్టట్లేదు. అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నా నాణ్యతా ప్రమాణాలపై రాజీపడబోమని చెబుతున్నారు. శివరాం, పీఆర్ విభాగం ఇంఛార్జీ ఈఈ, ఆదిలాబాద్ జిల్లా
రాష్ట్ర మంత్రి మండలిలో అన్ని జిల్లాలకి ప్రాతినిథ్యం ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి స్థానం లేదు. అందువల్లే జిల్లా సమస్యలను ప్రభుత్వానికి నివేదించటంలో నాయకత్వలోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
"జిల్లాలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసిన రోడ్లన్ని గుంతమయంగా మారాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రప్రభుత్వం పంపిస్తున్న నిధులను ఎం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా రోడ్లు వేయించాలని కోరుచున్నాము". - స్థానికుడు, ఆదిలాబాద్ జిల్లా
"ఆదిలాబాద్ పంచాయితీరాజ్ శాఖలో ఖాళీలు బాగా పేరుకుపోయాయి. జిల్లాలో అభివృద్ధిపనులు జరగడం లేదు. ఓకవేళ జరిగిన పర్యవేక్షించే వారు లేక నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. సదరు ఖాళీలలో ఇంఛార్జులను నియమించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలి". - స్థానికుడు, ఆదిలాబాద్ జిల్లా
"జిల్లాలో అభివృద్ధి పనులను చేపడుతున్నాము. జిల్లావ్యాప్తంగా మరమ్మతు చేయాల్సిన నిర్మాణాలు మాదృష్టికి వచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రి మరమ్మతులకు నిధులు విడుదలయ్యాయి. మరమ్మతు చేసిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిని మాదృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడుతాము". - శివరాం, పీఆర్ విభాగం ఇంఛార్జీ ఈఈ ఆదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్లో రెచ్చిపోతున్న స్థిరాస్తి వ్యాపారులు - అడ్డుకట్ట పడేనా? - Land Mafia Case in Adilabad