SERP Minister kondapalli Srinivas Review on New Pension Scheme : రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారం నుంచి పింఛన్ దరఖాస్తులకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించిందని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఆన్ లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పింఛన్ దారులు పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పింఛన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి తెలిపారు.
వరుసగా మూడు నెలలు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ తాత్కాలికంగా ఆపేయడం జరుగుతుందన్నారు. తర్వాత కాలంలో వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనేక మంది అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అవ్వతాతలకు గుడ్న్యూస్ - కొత్త పింఛన్లు జనవరి నుంచే
ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని సూచించారు. ఈ విధానాన్ని డిసెంబరు నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. భర్త చనిపోయినవారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పింఛన్లపై సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.