Selfies and Reels Becoming Dangerous Habit : స్మార్ట్‌ఫోన్లు చేతికి అందివచ్చిన తర్వాత నేను, నువ్వు, ఒక సెల్ఫీ అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎక్కువ మంది సెల్ఫీలు, రీల్స్ తీసి ఇతరుల్ని ఆకర్షించడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు. నూతన ప్రదేశాలకు వెళ్లినప్పుడు గాని, శుభ కార్యక్రమాల నిమిత్తం నలుగురు చేరితే యువత మెదడులో వెంటనే రీల్స్, సెల్ఫీలు స్మరిస్తున్నాయి. రీల్స్ తీసుకునే సెల్ఫీలు దిగే మోజులో ప్రమాదాల బారినపడి మృతి చెందేవారి సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. టీనేజర్లు, యువకులు సెల్ఫీవర్‌తో నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు దయనీయమైన జీవితం గడుపుతున్నాయి.
రోజుకు 14 కంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటే : చరవాణుల్లో ఫోటో ఫీచర్లు ఎన్నో ఉంటున్నాయి. రీల్స్, సెల్ఫీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రకరకాల ఎఫెక్టులతో వీడియోలు, ఫోటోలు తీసుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఒకరు రోజుకు 14 సెల్ఫీలకంటే ఎక్కువ తీసుకుంటే అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు ఒహియో యూనివర్సీటీ పరిశోధనలో వెల్లడైంది. సెల్ఫీలు, వీడియోలు తీయడంతోపాటు తీసిన వాటిని ఫోటోషాప్‌లో రంగులద్ది వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఓ రకమైన హెచ్చు మానసిక రుగ్మతలకు కారణమని వారు చెబుతున్నారు.
ప్రమాద హేతువులు ఇవే : మాచర్ల నుంచి విజయవాడ వరకు రైలుమార్గం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పులిచింతల, ఎత్తిపోతల, ప్రకాశం బ్యారేజి, కొండవీడు కోట, సూర్యలంక, నల్లమల అటవీ ప్రాంతం, జాతీయ, రాష్ట్ర రహదారులు, షాపింగ్ మాల్స్, గుంటూరు, విజయవాడ నగరాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, అమరావతి, తాడేపల్లి వద్ద కృష్ణానది రైలు వంతెనల వద్ద రీల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. పర్యాటక చారిత్రాక ప్రదేశాల్లోనూ రీల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు సెల్ఫీలు, రీల్స్ మారుమూల పల్లెలకు సైతం పాకాయి. ఇటీవల చోటు చేసుకున్న మరణాల్ని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఎటువంటి రక్షణ చర్యల్లేనిచోట రీల్స్ ప్రాణాలు తోడేస్తున్నాయి.
వ్యసనంగా మారకుండా చూసుకోవాలి: ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా ప్రతి నిమిషం ప్రతిక్షణం రీల్స్, సెల్పీలు తీసుకోవాలనుకోవడం మానసిక రుగ్మతలకు మొదటి కారణమని గుంటూరు సమగ్రాసుపత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ తెలిపారు. మూడు సెల్ఫీలు లేదా రీల్స్ తీసుకుని ఒక్కటి కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకపోవడం బోర్డర్ లైన్ అని తీసిన వాటిని పోస్ట్ చేస్తే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు అర్ధం చేసుకోవాలన్నారు. రోజుకు నాలుగు నుంచి ఆరు రీల్స్, సెల్ఫీలు ఎంపికచేసి అన్ని పోస్ట్ చేస్తే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నట్లుగా భావించి చికిత్స పొందాలన్నారు. రీల్స్ వ్యసనంగా మారక ముందే జీవనశైలిలో మార్పు చేసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆయన తెలిపారు.
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్ - ఫాలోవర్స్, లైకుల కోసం లైఫ్‌నే రిస్క్ - Youth with Reels Delusion
- నడికూడి నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న రైలెక్కి రీల్స్ తీసుకునే క్రమంలో ఇటీవల ఓ యువకుడు విద్యుత్తు స్తంభం తగిలి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అంతకు ముందు 2022 జనవరి 26న నడికూడి నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలెక్కి సెల్ఫీ(రీల్) తీసుకునే మోజులో విద్యుత్తు తీగలు తగిలి పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి వీరబ్రహ్మం విద్యాదాఘాతం బారినపడ్డాడు.
- రెండేళ్లక్రితం గుంటూరుకు చెందిన ముగ్గురు యువకులు నకరికల్లు మండలంలోని చల్లగుండ్లలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారిని కండ్లకుంట వద్ద జీబీసీ కాలువ పరవళ్లు ఆకర్షించాయి. ఇది సెల్ఫీలకు ప్రమాదకర ప్రదేశమనే బోర్డు ఉన్నప్పటికి పట్టించుకోకుండా రీల్స్ తీసుకుంటూ.. సెల్ఫీలు దిగుతూ ముగ్గురూ కాలువలో గల్లంతై మృతి చెందారు. ఇదే ప్రదేశం వద్ద నాలుగేళ్ల్లక్రితం చెందిన నరసరావుపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని సెల్ఫీ తీసుకుంటూ కాలువలోపడి మృతి చెందింది.
- కొత్త బండి కొన్న ఆనందంలో రాత్రిపూట ప్రయాణం చేస్తూ సెల్ఫీ(రీల్) తీసుకుంటూ సత్తెనపల్లి- నరసరావుపేట రహదారి మార్గంలో ముప్పాళ్ల మండలానికి చెందిన యువకుడు బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
- బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే పట్టాలపై రీల్స్ తీసుకుంటూ భార్యాభర్తలు మహమ్మద్ అహమ్మద్, ఆయేషా వారి మూడేళ్ల కుమారుడు అబ్దుల్లా రైలు ఢీకొని మృతి చెందారు. రైల్వే పట్టాలపై రీల్స్ తీయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన బహిర్గతం చేసింది. జిల్లాలోనూ ఈ తరహా సంఘటనలు జరిగినా గాని యువత మేల్కోవడం లేదు. చాలామంది రీల్స్, సెల్ఫీలకు వ్యసనపరులుగా మారుతున్నారు. అదే ప్రాణాల మీదకు తెస్తోంది.