Selfie Video of Eluru District Woman : బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడి అందరిని వదిలి పరాయి దేశానికి వెళ్లింది ఓ మహిళ. పొట్టకూటి కోసం అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. చేసిన పనికి జీతం ఇవ్వకపోయిన పర్వాలేదు.. ఇంటికి వెళ్తానని ఆ మహిళ మొర పెట్టుకుంది. కనికరించని యజమానులు ఆమెను గదిలో బంధించి నరకం చూపించారు. చివరి ప్రయత్నంగా తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె ఏలూరు జిల్లాకు చెందిన మహిళ.
వెలుగులోకి గల్ఫ్ దేశాల బాధితుల వ్యథలు - యాజమాన్యం హింసిస్తోందని మహిళ ఆవేదన - MUSCAT VICTIM
ఆశలు అడియాశలుగా మారి : ఉపాధి కోసం విదేశాలకు వెళితే చివరకు కష్టాలే మిగిలాయి ఆ మహిళకు. నాలుగు డబ్బులు వెనకేసుకుని తన పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆ తల్లి పడిన ఆశలు అడియాశలుగా మారాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి సంకురమ్మ తన ఇద్దరు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి ఏడాది క్రితం ఏజెంట్ల ద్వారా కువైట్ లో పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి సంకురమ్మ కుదిరారు. కొద్దికాలం సజావుగా సాగిన అనంతరం ఆ ఇంటి యజమానులు సంకురమ్మను ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు.
కుమిలి కుమిలి ఏడ్చింది : దీంతో ఆమె తన అన్న వెంకటేశ్వరరావుకు ఫోన్లో జరిగిన విషయం అంత తెలియజేశారు. అలాగే ఆమెని తీసుకువచ్చిన ఏజెంట్లకు తెలిపింది. ఈ విషయం తెెలుసుకున్న ఆమె యజమానులు సంకురమ్మను ఓ గదిలో బంధించి నాలుగు రోజులుగా చిత్రహింసలు పెట్టారు. కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. నిన్ను చాల డబ్బులు పోసి కొన్నాం. రెండేళ్ల వరకు వదిలే ప్రసక్తే లేదని యజమానులు తేల్చి చెప్పారు. ఏం చేయాలో తెలియక సంకురమ్మ బిడ్డలను, కన్నవాళ్లను గుర్తుకుతెచ్చుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. చివరి ప్రయత్నంగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంటికి వెళ్తానంటే కొట్టి గదిలో బంధించారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తనను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యే భరోసా : ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు బాధిత మహిళ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి సంకురమ్మని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పిల్లలు, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.