Scrap Merchant Cheating in Vijayawada: మంచి లాభాలు వస్తాయని ఓ వ్యాపారి నమ్మించడంతో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. తీరా వ్యాపారి చేతిలోకి డబ్బులు చేరిన తర్వాత ఇప్పుడు కోట్ల రూపాయల్లో మోసం చేసి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఇంతవరకు తుక్కు వ్యాపారి కదలికలపై సమాచారం రాబట్టలేకపోయారు. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించి వ్యాపారి కోసం వెతుకుతున్నారు. విజయవాడలో ఓ తుక్కు వ్యాపారి సుమారు 20 కోట్ల రూపాయలకు మించే మోసం చేసినట్లుగా తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకువస్తున్నారు.
విజయవాడ వించిపేటకు చెందిన అబ్ధుల్ ఫహీం అనే తుక్కు వ్యాపారి. తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించాడు. అదే ప్రాంతానికి చెందిన చిన్న వ్యాపారులను సంప్రదించాడు. ఆటోనగర్‌కు చెందిన అతని మామయ్య ఇక్బాల్‌తో కలిసి వ్యాపారం చేశాడు. అబ్దుల్ ఫహీం అందరితో మంచిగా ఉంటూ, పాత భవనాలు, పాత లారీలు వేలంలో పాడుకుని వాటిని అమ్మితే లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టించాడు. ఒక్కొక్కరి వద్ద పది లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా సేకరించినట్లు సమాచారం. పెట్టుబడి పెట్టినవారికి ముందుగా కొంత లాభాన్ని చూపించాడు. అధిక లాభాలకు ఆశపడి మరింత పెట్టుబడి పెట్టేంతవరకు వేచి చూసి పరారయ్యాడు.
ఓ వ్యాపారి 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతనికి కొంత లాభం వచ్చిందని ఇతరులకు ఎరవేశాడు. తాము మోసపోతున్నామనే విషయాన్ని వారెవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రస్తుతం వ్యాపారాలు సరిగా లేవని తెలిసినా వ్యక్తి నమ్మకంగా ఉండడంతో ఇంట్లో ఆడవాళ్లు, పిల్లల బంగారం వస్తువులు తాకట్టు పెట్టి మరీ తాను 28 లక్షల రూపాయలు వరకు తీసుకొచ్చి ఇచ్చానని మరో బాధితుడి ఆవేదన వెలిబుచ్చాడు. తాము పెట్టుబడులు పెట్టడమే కాక, తమ స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టించామని తెలిపారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - cyber crimes in AP
వడ్డీకి ఇచ్చినా వస్తాయో లేదోనని, అబ్దుల్ ఫహీం మాటలు నమ్మి తనతోపాటు బంధువుల వద్ద నుంచి తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు వరకు మరో బాధితుడు పెట్టుబడి పెట్టాడు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారు. తీరా ఇప్పుడు ఆ తుక్కు వ్యాపారి గత కొంత కాలం నుంచి కనిపించకపోవడంతో వారంతా కొత్తపేట పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారి అబ్దుల్‌కు తాము ఫోన్ చేసి తమ పెట్టుబడుల గురించి అడిగినా అతని నుంచి తగిన స్పందన లేకపోతోందని, అతని మామయ్య ఇక్భాల్‌కే ఈ మొత్తం ఇచ్చినట్లుగా చెబుతున్నాడని తెలిపారు.
దీంతో పోలీసులు అతన్ని ప్రశ్నించేందుకు స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం అందుకున్న బాధితులు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పెళ్లిళ్లకు, ఇతర అవసరాల కోసం డబ్బులు ఉపయోగపడతాయనే దాచుకున్నామని, అధిక లాభాలకు ఆశపడి ఇచ్చినందుకు ఇలా ఇరుక్కుపోయామని బాధితులు వాపోతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
బాధితుడు అక్బర్ ఇమ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అబ్దుల్ ఫహీం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్దుల్ ఫహీం రాజమహేంద్రవరం, విశాఖల్లో ఉన్నట్లు అనుమానంతో ప్రత్యేక బృందాలను పంపారు. అబ్దుల్ ఫహీం మామయ్య ఇక్బాల్ ఫోన్‌కాల్స్‌పై సైతం పోలీసులు నిఘా ఉంచారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.