SC ST Atrocity Case On YSRCP MLA Candidate Thota Trimurthulu : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుతో పాటు ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
SC, ST Atrocity Case on YSRCP MLC Thota Trimurthulu : పోలింగ్ జరిగిన సోమవారం రాత్రి వల్లూరులో వైఎస్సార్సీపీ, కూటమి పార్టీల నాయకుల మధ్య జరిగిన ఘర్షణలు చిలికిచిలికి గాలివానలా మారాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదుతో మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో పాటు మరికొందరు తనను కులం పేరుతో దూషించి, మారణాయుధాలతో దాడి చేశారని ఆ గ్రామ సర్పంచి దాసి మీనాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వల్లూరులో ఉద్రిక్త వాతావరణం - జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అరెస్టు - Vegulla leela Krishna Arrest
త్రిమూర్తులు, ఆయన తనయుడు పృథ్వీరాజ్, నేమాని రాజశేఖర్, చోడే శ్రీకృష్ణ, దేవళ్ల రుద్రయ్య చౌదరి, దేవళ్ల రామలింగ చౌదరి, ముత్యాల సతీష్‌కుమార్‌లతో పాటు మరికొందరి పేర్లను అందులో పేర్కొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ సంఘటన స్థలంలోనే ఉన్నా గొడవ సద్దుమణిగించడానికి ప్రయత్నించలేదని ప్రస్తావించారు. దీంతో ఫిర్యాదులో పేర్కొన్న ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అంగర ఎస్సై అందే పరదేశి తెలిపారు.
మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు : ఎన్నికల రోజు రాత్రి మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ తన స్థలంలో గ్రామ పెద్దలతో కలిసి ఉండగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన అనుచరులతో కలిసి ఆయనపై మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారని లీలాకృష్ణ భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోట పృథ్వీరాజ్, దేవళ్ల రుద్రయ్యచౌదరి, దేవళ్ల రామలింగయ్య చౌదరి, ముత్యాల సతీష్‌కుమార్‌లతో పాటు మరికొందరు ఈ దాడిలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
తోట త్రిమూర్తులుతో తన భర్తకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు. దీనిపై అంగర ఎస్సై పరదేశి కేసు నమోదు చేశారు. బీ వల్లూరులో మే 13న జరిగిన ఘర్షణలపై గురువారం కొత్తపేట డీఎస్పీ రమణ, మండపేట గ్రామీణ సీఐ శ్రీధర్ కుమార్ తదితరులు ఫిర్యాది గ్రామ సర్పంచి మీనాకుమారితో పాటు, మరి కొందరిని కేసు విషయమై ప్రశ్నించి, ఆధారాలు సేకరించారు. సర్పంచికి ఆరోగ్యం బాగోలేకున్నా అరగంట పాటు ఎండలో నిలబెట్టి విచారించారని ఆమె భర్త ఈశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.