COCKFIGHTING IN EAST GODAVARI: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పందాలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇచ్చి మరీ పందాల్లో దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజులను సిద్ధం చేస్తున్నారు. కొందరు ఆన్‌లైన్‌లోనే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్ని పరిమితులు విధించినప్పటికీ ఈ జిల్లాల్లో సంక్రాంతి అంటే ఇది ఆచారంగా మారిన పరిస్థితి. ఈ ప్రాంతవాసుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా ఇందులో పాల్గొనడం విశేషం. ఆ మూడు రోజులు జరిగే ఈ తంతుకు రూ.500 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. దీంతో పుంజుల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
చంద్రన్న సంక్రాంతి సంబరాలు - అంబరాన్నంటేలా మహిళా కబడ్డీ పోటీలు
సంక్రాంతి కల్లా రూ.25 కోట్ల మేర అమ్మకాలు: ఆయిల్‌పాం తోటలు మొదలు, చెరువు గట్లు, పొలాలు తదితర ప్రాంతాల్లో కోళ్ల పెంపకాలు జరుగుతాయి. పందెం రాయుళ్లు పెంపకందారులతో ఒప్పందం చేసుకుని ప్రత్యేకంగా కోళ్లను పెంచుతారు.అడ్వాన్సు చెల్లించి వారు ఇక్కడకు వచ్చే నాటికి సిద్ధం చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కోడిపుంజు రంగు, ఎత్తును బట్టి ఒక్కో పుంజును రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు వాటి ధర పలుకుతుంది. సంక్రాంతి కల్లా వీటి అమ్మకాలు రూ.25 కోట్లకు పైనే జరిగే అవకాశం ఉంటుంది.
ఊరంతా సంక్రాంతి సంబరాలు - రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు
పందానికి సన్నద్ధం చేస్తారు: నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, రసంగి, సీతువ తదితర జాతులకు చెందిన రెండేళ్ల వయసున్న కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. గుడ్లు, బాదంపప్పు, మటన్, జీడిపప్పు, రాగులు, సజ్జలు ఆహారంగా పెడతారు. బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేత తినిపిస్తారు. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి పట్టిస్తారు. బికాంప్లెక్స్ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి పెడతారు. 90 రోజుల పాటు ఇదే తరహా ఆహారం అందిస్తారు. చెప్పాలంటే కోళ్లను ఇంట్లో బాలింత కంటే భద్రంగా చూస్తారు. స్నానానికి, తాగేందుకు వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణ కోసం నీళ్లలో వదిలి వారానికి ఒకసారి ఈత కొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు.