Sanitation Workers Jobs For Sale in Anantapur : ప్రభుత్వం మారినా అనంతపురం నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలతో సొమ్ము చేసుకునేందుకు అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఉద్యోగాల భర్తీ పేరుతో వేల రూపాయల వసూలుకు తెరలేపారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థలో పరిధిలో 4 లక్షల 20 వేల జనాభా ఉంది. సుమారు 183 వరకు కాలనీలు ఉన్నాయి. నగరంలో 600లకు పైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 132 మంది శాశ్వత ఉద్యోగులు కాగా, 409 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు.
విస్తరించిన అనంతపురం నగరానికి మరో 200 మంది కార్మికుల అవసరం ఉందని కార్మిక సంఘాలు మూడు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆప్కాస్ ద్వారా 50 మందిని తీసుకోవాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఆమోదం పొందకుండానే, ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కొంతమంది వసూళ్లకు తెరలేపారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో అదనంగా 131 మంది పారిశుధ్య కార్మికులను రోజువారీ కూలీ ప్రాతిపదికన నియమించారు.
పీఎఫ్, ఈఎస్ఐ వంటివి లేకపోయిన చాలీచాలని జీతంతో పనిచేస్తున్నాం. మహిళలు చెప్పుకోని అగచాట్లతో బాధపడుతున్నారు. పరిస్థితి మారేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికుల సంఖ్యను పెంచాలి. కోవిడ్ నుంచి పని చేస్తున్న వారిని ఆప్కాస్లోకి తీసుకోవాలి. - పారిశుధ్య కార్మికులు
కోవిడ్లో పని తీసుకెళ్లినప్పుడు భవిష్యత్తులో మంచి వేతనం వస్తుందని, శాశ్వత ఉద్యోగులుగా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. వాళ్లంతా అప్పటి నుంచి చాలీచాలని జీతంతో పనిచేస్తున్నారు. వీరిలో 50 మంది కార్మికులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని అధికారులు, పాలక వర్గంలోని కొందరు పెద్దలు ప్రచారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే పనిచేస్తున్న వారందరినీ ఆప్కాస్ కింద కార్మికులుగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నగరపాలక సంస్థలో అడ్డగోలు నిర్ణయాలు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, పాలక వర్గ నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతో పేద కార్మికులకు అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.