Munneru Floods Victims Problmes : మున్నేరు వరదలతో విరుచుకుపడి ఊళ్లను, పంట పొలాలను ముంచేసింది. ఇసుక మేటలు పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 2000ల హెక్టార్లలో నష్టం సంభవించింది. పంట పొలాలన్నీ ఇసుకతో నిండిపోయాయి. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు సమీపంలో మున్నేరు గట్టుకు భారీ గండి పడడంతో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.
పెద్దఎత్తున ఇసుక మేటలు : పోలంపల్లి, కన్నెవీడు, గంగవల్లి, పోచవరం, లింగాల, చిట్యాల, ఆళ్లూరుపాడు, వేమవరం, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, వెంకటాపురం గ్రామాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వత్సవాయి మండలంలో 510 ఎకరాలు, పెనుగంచిప్రోలు మండలంలో 650 ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
మరోవైపు వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనిరాకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. రెండడుగల ఎత్తున పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించుకోవడం కర్షకులకు సవాల్‌గా మారింది.
"పంట పొలాలకు అపార నష్టం జరిగింది. వరి, అరటి పూర్తిగా కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇక సాగు చేసే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు పెట్టుబడంతా వరద పాలైంది. వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లు కొట్టుకుపోయాయి. వాటిని బాగు చేయాలంటే ఖర్చు అధికంగా ఉంది. పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఆ లోటు ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - బాధిత రైతులు
Crop Damage in Munneru Floods : మరోవైపు వరద ఉద్ధృతికి వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లు కొట్టుకుపోయాయి. కొందరికి మోటార్లు దొరికినా రిపేర్లు చేయడానికి కూడా పనికిరాకుండా పోయాయి. వేల రూపాయలు ఖర్చు చేసి వాటిని బాగు చేయించుకోలేని పరిస్థితి. ఇక బోర్లు పూర్తిగా ఇసుకతో పూడిపోయాయి. ఒక్కో బోరు మళ్లీ తీయించాలంటే రూ.15,000ల నుంచి రూ.20,000ల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
కోనసీమ లంక గ్రామాలను ముంచేసిన గోదావరి - డ్రోన్ విజువల్స్ - Flood Affect in Mummidivaram
విజయనగరం జిల్లాలో వరదలు - వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం - Crop Damage in Vizianagaram