Samantha and Naga Chaitanya on Konda Surekha: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ పెట్టారు.
సమంత ఏమ్మన్నారంటే: నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నానని సమంత పేర్కొన్నారు. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని అన్నారు. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నానని అన్నారు.
వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నానని అన్నారు. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని ఈ సందర్భంగా తెలిపారు. నా విడాకుల విషయంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని పేర్కొన్నారు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరు. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నానని నటి సమంత పేర్కొన్నారు.
ఖండించిన నాగచైతన్య: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ మేరకు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోవద్దని హితవు పలికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలంటూ సూచించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని అన్నారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారంటే: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ తమ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో చాలామంది ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్ కారణమని మంత్రి ప్రస్తావించారు.