Road Accident In Medak District : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది. జిల్లాలోని శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద రోడ్డుపై ఉన్న గుంత వారి పాలిట మృత్యువుగా మారింది. అతివేగం, రహదారిపై ఉన్న గుంతను గమనించకపోవడంతో కారు అదుపుతప్పి గాల్లోకి లేచింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాద సమయంలో కారు వేగంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గుంతలో కారు పడి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించలేదు. కారులో ఉన్న 8 మందిలో ఏడుగురు ఊపిరి ఆడక చనిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు కాలువలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఏడుగురు చనిపోయి ఉన్నారు.
దావత్ నుంచి వస్తుండగా : మృతులను భీమ్లా తండాకు శాంతి (38), మమత (12), సీతారాం తండాకు చెందిన అనిత (35), హిందూ (13), శ్రావణి (12), తలపల్లి తండాకు చెందిన శివరాం (56), దుర్గి (45) గా గుర్తించారు. ప్రమాదంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నామ్‌సింగ్ (40)కు తీవ్ర గాయాలయ్యాయి. అతని రెండు కాళ్లు విరిగాయి. వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నామ్‌సింగ్ భార్య శాంతి, కుమార్తె మమత, అత్త, మామ, మరదలు కూడా మృతి చెందినట్లు గుర్తించారు. వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత దావత్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు.
ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చారు. ఊపిరి ఆడక ఏడుగురు కారులోనే చనిపోగా డ్రైవర్ నామ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. అతను ప్రస్తుతం స్పృహలో లేడని తరువాత అతనికి డ్రంక్ డ్రైవ్ టేస్ట్ చేసి మద్యం మత్తులో ఉన్నడా లేడా అనేది తెలుస్తామని తెలిపారు.
ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన నామ్సింగ్కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు - తప్పిన పెను ప్రమాదం
బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా - మహిళ మృతి, ముగ్గురికి గాయాలు - Road Accident In Hyderabad