Road Accident in Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, లారీలు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరు జిల్లా మొగిలి కనుమ రహదారిలో వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా, లారీ బెంగళూరు వైపు నుంచి వస్తోంది. లారీ ఇనుప చువ్వల లోడ్‌తో ఉండటంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జైంది. బస్సులో ప్రయాణిస్తున్న వారు లారీలోని ఇనుప చువ్వల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, ఇనుప చువ్వల కింద ఇరుక్కుపోయిన ప్రయాణీకులతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. ఈ ఘటనలో ఆర్డీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఏడుగురుది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు.
కళ్లుమూసి తెరిచేలోపు ప్రమాదం: సాధారణ వేగంతో ఆర్టీసీ బస్సు వెళుతుండగా, అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి డివైడర్ దాటి తమ వైపు వచ్చి ఢీకొట్టిందని ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుడు తెలిపారు. కళ్లుమూసి తెరిచేలోపు ప్రమాదం జరిగిపోయిందని, ప్రమాద ధాటికి చెల్లాచెదురయ్యామన్నారు.
అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారి శరీరాలు ఛిద్రమై పోయాయి. దీంతో మృతులను గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. మొగిలి కనుమ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారి అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
CM and Deputy CM on Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం దిగ్భ్రాంతికమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Minister Nara Lokesh Respond on Accident: మొగిలిఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొగలిఘాట్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి అరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి దుర్మరణం - Road Accident in Tirupati District