Revenue Officers Notices To BRS MLA Marri Rajasekhar Reddy : రాష్ట్రంలో హైడ్రా హవా కొనసాగుతుంది. రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టడంతో, పలువురు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన యాజమాన్యాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే దుండిగల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు ఇచ్చారు.
వీటితోపాటు ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన భవనాలను తొలగించాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. చిన్న చెరువులోని సర్వే నెం. 405, 482, 486లోని భూముల్లో 10 ఎకరాలు ఆక్రమించి కళాశాల యాజమాన్యం శాశ్వత భవనాలు, షెడ్లు నిర్మించారని, పార్కింగ్ ప్రదేశం కోసం చెరువులోని కొంత భాగాన్ని పూడ్చారని ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గతంలోనూ నోటీసులు జారీ చేయడంతో ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది.
ఈ విషయంపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు : ఆ సమయంలో కొంత ఆక్రమిత ప్రదేశాల్లోని నిర్మాణాలను కూల్చివేశారు. అయినప్పటికి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో యాజమాన్యం ఇంకా నిర్మాణాలను కొనసాగిస్తుందని దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై హైడ్రాకు కూడా ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు మరోసారి ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలకు నోటీసులు పంపించారు. అయితే ఈ విషయంపై కళాశాల యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు.
Hydra Commissioner Clarity On Education Institutions Demolish : రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా స్పష్టం చేశారు. అక్కమార్కుల జాబితాలో ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడమని, విద్యార్థుల భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని తెలిపారు. చెరువులను ఆక్రమించి కాలేజీ భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చన ఆయన, ఎఫ్‌టీఎల్ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని స్పష్టం చేశారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కాలేజీలకు సమయం ఇస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా తమ చర్యలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ధర్మసత్రమైనా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తామని తేల్చి చెప్పారు.
హైడ్రా నోటీసులు ఇవ్వదు - కూల్చడమే : కమిషనర్ రంగనాథ్ - Commissioner Ranganath On HYDRA