APPSC New Chairman: రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ(APPSC) నూతన ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాధను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఇవాళ జీవో విడుదల చేశారు. ఈమె గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై నాలుగో తేదీన జగన్ సర్కార్‌లో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ గౌతంసవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఛైర్‌పర్సన్ నియామకంతో త్వరలోనే పెండింగ్‌లోని ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ బాధ్యతల్ని విశ్రాంత పోలీస్ అధికారిణి ఏఆర్ అనురాధకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్ నియామకం విషయంలో అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ- చివరికి ప్రభుత్వం ఏఆర్ అనురాధ వైపు మొగ్గు చూపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఏఆర్ అనురాధ గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో సేవలందించారు.
ఏఆర్ అనురాధ 1987 బ్యాచ్ IPS అధికారిణి. అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి. ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం అందుకు సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టి ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను ఖరారు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో ఎస్పీగా, ఐజీగా అనురాధ పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో IAS అధికారి రేచల్‌ఛటర్జీ తొలి ఏపీపీఎస్సీ మహిళా ఛైర్‌పర్సన్ కాగా విభజిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు అనురాధ తొలి మహిళా ఛైర్‌పర్సన్. అలాగే రెండో IPS అధికారి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శించింది. గ్రూప్- 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మేలు చేసేందుకు ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేశారని ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే మరో ఏడాది పదవీ కాలం ఉన్నా అప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న గౌతం సవాంగ్ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియమాకాల ప్రక్రియ వేగవంతమవుతాయని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విద్యాశాఖ ఏపీ టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి ప్రారంభించి 21వ తేదీ వరకు జరిపింది. త్వరలో ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లూ ఏపీపీఎస్సీకి ఛైర్మన్ లేక అనేక కార్యకలాపాలు స్తంభించాయి. పరీక్షల తేదీలు ఖరారు కావడంలేదు. ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం నిలిచిపోయింది. నియామకాల జాబితా వెల్లడించలేదు. కమిషన్ సమావేశాలు జరగలేదు. పరీక్షలు నిర్వహించే ఏపీఆన్‌లైన్ వారికి రూ.3 కోట్ల వరకు బిల్లులను నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించలేదు. పరీక్షల తేదీల ఖరారులో దీని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఇప్పటికే వెలువడ్డ సుమారు 20 నోటిఫికేషన్‌ల జారీకి అనుగుణంగా తేదీలు ఏపీపీఎస్సీ ప్రకటించాల్సి ఉంది.
ఏపీ ఆన్‌లైన్ వారితో చర్చించి, ఇతర పరీక్షలకు అవరోధం లేకుండా తేదీలు ఖరారు చేయాలి. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు 290, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు-99, టీటీడీ డిగ్రీ లెక్చరర్స్-78, ఇంటర్ విద్య లెక్చరర్స్-47, అసిస్టెంట్ ఎనిర్వాన్‌మెంట్ ఇంజనీర్-21, ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ప్రకటించాల్సి ఉంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు నిర్వహించాలి. నాటి వైకాపా పాలన విధానాల మేరకు జరిగిన ప్రశ్నపత్రాల తయారీపై పునఃపరిశీలన చేయాలని చాలా మంది అభ్యర్ధులు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్, హోమియో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల జాబితా వెల్లడించాలి. గ్రూపు-2 ప్రధాన పరీక్షల నిర్వహణ తేదీల ఖరారు కావాలి. శాఖాపరమైన పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఎగ్జామినర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. కొన్ని పరీక్షలకు ‘వైవా’ నిర్వహించాలి. నవంబరు/డిసెంబరులో జరిగే శాఖాపరమైన పరీక్షల నిర్వహణకు ప్రస్తుతం జరగాల్సిన ప్రక్రియ మొదలు కావాలి. ఉప విద్యా శాఖ అధికారుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో సిలబస్ వెలుపల నుంచి ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పునఃపరిశీలన చేయాల్సి ఉంది.
ప్రస్తుత కమిషన్‌లోని సభ్యుల నియామకాలు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగాయి. వీరిలో కొందరు సభ్యులు నేరుగా వైఎస్సార్సీపీతో పూర్తిస్థాయిలో అంట కాగిన వారే ఉన్నారు. ఈ దశలో ఏపీపీఎస్సీలో సంస్థాగత సంస్కరణలు వడివడిగా చేపట్టాల్సిన అవసరత కొత్త ఛైర్‌పర్సన్ ముందు ఉన్నాయి.