Property purchase In Hyderabad : విజయవాడ జాతీయ రహదారిపై నగరానికి ముఖ ద్వారంగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం దశాబ్ద కాలంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. పాత, కొత్త కలిపి దాదాపు 600 కాలనీలు ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతం అనూహ్య స్థాయిలో విస్తరించి రూపురేఖలే మారిపోయాయి. నివాసానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రో సదుపాయంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉండటంతో కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు పెరిగాయి.
బహుళ అంతస్తుల భవనాలు : గతంలో కాలనీల్లో ఎక్కువ మొత్తంలో స్థలాలు ఉండేవి. గజం ధర రూ.20 వేల నుంచి రూ.40 వేలు పలికేవి. ఆ సమయంలో చాలా మంది ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో శివారు కాలనీల్లోనూ గజం రూ.40 వేలకు పైనే ఉంది. ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం మధ్య తరగతికి భారంగా మారింది.
దీంతో 300 గజాల కంటే ఎక్కువగా స్థలం ఉంటే దానిని బిల్డర్లు బహుళ అంతస్తుల భవనంగా నిర్మించి ఫ్లాట్‌లను అమ్ముతున్నారు. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటాయి. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోనైతే 1000 చదరపు అడుగుల ఫ్లాటు రూ.45 లక్షల వరకు వస్తుంది. ప్రజలు శివారు కాలనీల్లో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రధాన రహదారి నుంచి 4 కిలోమీటర్లైనా సరే : గతంలో కేవలం మన్సూరాబాద్ వంటి ప్రాంతంలో మాత్రమే అపార్ట్‌మెంట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రధాన రహదారి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలనీల్లో సైతం బహుళ అంతస్తు భవనాలు కడుతున్నారు. వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం ప్రాంతాల్లోని శివారు కాలనీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని 1000 చదరపు అడుగుల ఫ్లాట్లు రూ.50 లక్షల లోపు లభించేలా ప్లాన్ చేసి కడుతున్నారు.
ప్లాట్ లేదా ఇళ్లు కొంటున్నారా? - తప్పనిసరిగా ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి