Ramoji Rao Final Rites Journey : Ramoji Rao Final Rites Journey : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానాలు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఆ తర్వాత రామోజీరావు పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివదేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అక్షర సూరీడి అఖరిప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్న వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులు అర్పించారు. ఛైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు.
అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు.
రామోజీరావు అంతిమ యాత్రలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, మురళీమోహన్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డి, వెనిగండ్ల రాము, అరికపూడి గాంధీ పాల్గొన్నారు.
స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్న రామోజీ - Media Mogul Ramoji Rao Smruthi Vanam