Ramoji Rao Condolence Program at Press Club: క్రమశిక్షణకు మారుపేరు, విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. కలలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని ఆవేదన చెందారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంతాప కార్యక్రమానికి ఈనాడు తెలంగాణ సంపాదకుడు డీఎన్ ప్రసాద్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకుడు కృష్ణమూర్తి, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్‌లు తదితరులు హాజరయ్యారు. అనంతరం మీడియా లెజెండ్ రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ 'కఠినమైన క్రమశిక్షణ రామోజీరావు మొదటి లక్షణం. విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారు. తెలుగువారికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. కలలో కూడా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. 39 సంవత్సరాలు ఛైర్మన్‌తో కలిసి ప్రయాణించాను. ఆయన నిఖార్సైన జర్నలిస్ట్. ఉదయం 4 గంటలకే ఛైర్మన్ దినచర్య ప్రారంభమయ్యేది. ఆయన జీవితం నుంచి కొన్ని నేర్చుకుని మనం పాటించినా మంచి విజయాలు సాధించవచ్చు' అని తెలిపారు.
"రామోజీరావు గారిలో అనేక గుణాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఎన్నైనా నేర్చుకోవచ్చు కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరూ నేర్చుకోలేరు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరు. ఈనాడు దినపత్రికను విశాఖపట్టణంలో పెట్టడమే ఒక సాహసం. ఒక తెలుగు పత్రికను 46 ఏళ్ల పాటు అగ్రస్థానంలో నిలపడమే ఒక గొప్ప విషయం. ఆయన మీడియా యజమాని మాత్రమే కాదు. నిఖార్సైన జర్నలిస్ట్." - ఎం. నాగేశ్వరరావు, ఈనాడు ఏపీ ఎడిటర్
ప్రతి ఆలోచనకు పక్కా ప్రణాళిక : ప్రతి ఐడియా రాసి పెట్టుకొనేవారు. వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికను ముందే వేసుకొని ఛైర్మన్ విజయం సాధించేవారు. ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలని అనుకొనేవారు. ఏ వ్యాపారం అయినా కొత్తగా ఆలోచించేవారు. తాను రిపోర్టర్‌గా చేరి అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లడంతో ఎక్కువసార్లు ఛైర్మన్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. అందులో బాగున్నవి, బాగా లేనివి మార్క్ చేసేవారు. ఇప్పటికీ ఆయన లేరనే ఆలోచన రావడం లేదని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ తెలిపారు.
"తెలుగు పత్రికకు జాతీయ స్థానం కల్పించారు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ తహతహలాడలేదు. అనుకున్నది సాధించడానికి ఎంతైనా కష్టపడే తత్వం రామోజీరావు సొంతం. తెలుగు జర్నలిజానికి దేశంలో, విదేశాల్లో పేరు రావడానికి ఎంతో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. లోతైన అవగాహన తెచ్చుకున్న తరువాతే అందులో అడుగుపెట్టేవారు." - శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్
యువతపై రామోజీరావుకు ఎనలేని విశ్వాసం : యువతపై రామోజీరావుకు ఎనలేని విశ్వాసమని ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ అన్నారు. అక్రమ కేసులు వస్తే సిబ్బందికి ఆయన అండగా నిలిచేవారని గుర్తు చేశారు. రామోజీరావు కళాకారులను ఎంతో ఆదరించేవారని ఆయన వ్యాఖ్యానించారు.
ఓ పత్రికను 50 ఏళ్ల పాటు అగ్రపథాన నడిపిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. అవకాశం ఉన్నా ఎప్పుడు రాజకీయ పదవుల కోసం, ప్రచారం కోసం పాకులాడలేని నిరాడంబరత రామోజీరావు సొంతమని పలువురు సీనియర్ జర్నలిస్ట్‌లు తెలిపారు. పట్టుదలతో ప్రతి విషయం సాధించిన లివింగ్ లెజెండ్‌గా వారు రామోజీరావును అభివర్ణించారు. పత్రిక ఎప్పుడు ప్రతిపక్షమే అన్నది ఆయన వైఖరని, విలువలు, నిబద్ధతే ఆయన విజయరహస్యంగా పేర్కొన్నారు.