Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024 : సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లన్నీ రంగు రంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లు రూ.3 నుంచి రూ.3వేల దాకా వివిధ ధరల్లో రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లు వీటిలోనూ ప్రత్యేకతలు వచ్చేశాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. ప్రేమను పంచి బంధాన్ని పెంచుకోవడానికి రక్షా బంధన్ కోసం సిద్ధమవుతున్నారు.
మన ఆచారాలు, సంప్రదాయాల్లో దాదాపు ప్రతీ దాని వెనక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చినవే ఆచారాలు. సహజంగా పెళ్లైన తర్వాత ఆడపిల్లలు మెట్టినింట్లో తీరిక లేకుండా ఉండిపోతారు. ఎప్పుడో పండగలకు వచ్చిపోతారు. అది కూడా కొందరికి వీలు కాదు. రక్షా బంధన్‌కు మాత్రం తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి వారిచ్చే చిరు కానుకలు పొందేందుకు ఎంతో ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వెళ్తారు. సోదరుల మణికట్టుకు కట్టే రాఖీ ద్వారా తోబుట్టువులతో తమ బంధం పదిలంగా ఉండాలని కోరుకుంటారు.
మొదట రాఖీలు కేవలం కొన్ని నూలు లేదా సిల్కు దారాలతో తయారు చేసేవారు. వాటికి సహజ రంగులద్ది వాటిని సోదరులకు కట్టి, బొట్టు పెట్టి, మిఠాయిలు పంచి ఆశీర్వదించి వారిచ్చే కానుకలు స్వీకరించేవారు. అయితే రానురాను ప్రజల అభిరుచి, ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ప్రతీది అందంగా, అకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. నారికి తగినట్లే తయారీదారులు కూడా రంగురంగుల రాఖీలకు వన్నెలద్ది, చెమ్కీలతో మెరుపుల మెరుగులు పెట్టి భిన్నంగా చేస్తున్నారు. పండుగకు కొన్ని గంటలే సమయం ఉండటంతో మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
కిక్కిరిసిన బేగంబజార్ మార్కెట్ : రాఖీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు బేగంబజార్ మార్కెట్‌కు ప్రతి ఏటా రాఖీలు కొనుగోలు చేసేందుకు వస్తుంటామని మహిళామణులు చెబుతున్నారు. అలాగే అన్న, తమ్ముళ్లు తమకు రక్షణగా ఉంటారని రాఖీలు కడతామని వారు చెప్పారు. ఎక్కడ చూసిన అన్ని దుకాణాలు మహిళలతో నిండిపోతున్నాయి. గత ఏడాది కంటే రాఖీ దుకాణాలు అధికం అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం వ్యాపారం బాగుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ సందర్భంగా రాఖీలతో పాటు, మిఠాయిలు, దుస్తుల కొనుగోళ్లతో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
పండుగ షాపింగ్ చేస్తున్నారా - ఈ మార్కెట్లో తక్కువ ధరకే బెస్ట్ రాఖీలు - Rakhi Festival 2024