Rain Alert in Telangana 2024 : మార్చి నెల ఆరంభం నుంచే ఎండలు (Rising Temperatures in Telangana) మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. భానుడి భగభగ నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. మరోవైపు ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపిది.
Telangana Weather Report Today : తాజాగా వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది.
Yellow Alert in Telangana : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో వెల్లడించింది.
తొమ్మిది జిల్లాల్లో వర్షపాతం నమోదు : తెలంగాణలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 జిల్లాల్లో వందకు పైగా ప్రాంతాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో 5 సెం.మీ., కరీంనగర్‌లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడ్డాయి. వర్షాలతో రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి.
El Nino Effect In India : మరోవైపు ఎల్ నినో పరిస్థితులు వేసవి కాలం మొత్తం ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది భానుడి భగభగలు తప్పవని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఏపీ, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక
Telangana Weather Update : ఎండలు.. బాబోయ్ ఎండలు.. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?