Cyclone Dana Effect On Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 22వ తేదీ ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయానికి తుపానుగా మారిన ఇది గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. తుపాను ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి ఈనెల 25 ఉదయంలోగా పూరీ(ఒడిశా), సాగర్ ద్వీపం(పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్రకు మోస్తరు వర్ష సూచన : దానా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండకపోవచ్చని భారత వాతావరణశాఖ మాజీ డీజీ డా.కేజే రమేశ్ తెలిపారు. ఈ తుపాను ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమ బెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అయితే వర్షాలపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందన్నారు. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. మరో నాలుగు రోజులు తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
పలు రైళ్లు రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే : దానా తుపాను ఎఫెక్ట్‌తో తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లు ఈనెల 23, 24, 25 తేదీల వరకు రద్దయ్యాయి. ఈ రైళ్లలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర ప్రాంతాలకు వెళ్లేవి కూడా ఉన్నాయి. మొత్తం 41 రైళ్లను రద్దు చేయగా వాటిలో అత్యధికం గురువారం వెళ్లే 37 సర్వీసులు రద్దు చేశారు. హావ్‌డా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగే రైళ్లను ఎక్కువగా రద్దు చేశారు. మరోవైపు విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలును కూడా ఈనెల 24వరకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు రద్దు చేశారు.
ట్రైన్ ప్రయాణికులకు ముఖ్య గమనిక - ఆ వైపు వెళ్లే 41 రైళ్లు రద్దు