Railway Employee Restored Koneru in Guntur District : వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోనేరు మురికికూపంలా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఓ రైల్వే ఉద్యోగి దాని పునరుద్ధరణకు పూనుకున్నారు. పట్టుదలతో పరిశుభ్రం చేసి దాన్ని ఓ పుష్కరిణిలా తీర్చిదిద్దారు. విజయదశమికి అందులో అమ్మవారికి తెప్పోత్సవం కూడా నిర్వహించారు. కొన్ని నెలల క్రితం అసాంఘికశక్తులకు అడ్డాగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
మురికికూపం లాంటి కోనేరు పునరుద్ధరణ : గుంటూరులోని ఆర్ అగ్రహారం శివాలయానికి అనుబంధంగా ఉన్న కోనేరు ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై మురికికూపంలా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల వారు చెత్తాచెదారం, జంతువుల కళేబరాలు తెచ్చి పడేస్తుండేవారు. రానురాను దుర్గంధ భరితమైంది. ఇదే ప్రాంతంలో నివాసముండే లోకోపైలట్ మంజునాథ్ కోనేరు దుస్థితిని మార్చాలని సంకల్పించారు. సొంత ఖర్చులతోనే కోనేరు చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు తొలగించి గోతుల్ని మట్టితో పూడ్చారు. నీళ్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. మంజునాథ్ శ్రమకు కొందరు గ్రామస్థులూ తోడ్పాటు అందించారు. అంతా కలిసి 6 నెలల్లో కోనేరు రూపురేఖల్ని మార్చేశారు.
వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
కోనేరు రూపురేఖల్ని మార్చిన మంజునాథ్ : కోనేరు మళ్లీ పాడుబడకుండా లోక్‌పైలట్ మంజునాథ్ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కోనేరు చుట్టూ మొక్కలు నాటి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. దసరాకు ఆలయ అధికారుల సహకారంతో అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల చివరిరోజు అమ్మవారి విగ్రహంతో ఇదే కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఖాళీ డ్రమ్ములపై కర్రలు పేర్చి దాన్ని తెప్పలా మార్చారు. చుట్టూ విద్యుద్దీపాలతో అలంకరించి అందులో అమ్మవారిని ఊరేగించారు.
కోనేరు వద్ద ఆధ్యాత్మిక శోభ : తెప్పోత్సవంతో కోనేరుకు కొత్త కళ వచ్చింది. అమ్మ ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు జ్ఞానప్రసూన బాబాతోపాటు భవాని భక్తులూ తెప్పోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే కోనేరు చుట్టూ మరింత అభివృద్ధి చేయొచ్చని మంజునాథ్ కోరుతున్నారు. ఖైదీల పరివర్తన తేవాలనే ఉద్దేశంతో 1896లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న కేతరాజు జగన్నాథం పంతులు ఈ కోనేరును తవ్వించారు.
కరోనా సాకుతో దర్శనం ఆపేశారు - దైవ దర్శనం ఎప్పుడు? దసరా పండగ వేళ భక్తుల ఆవేదన
గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి, కాళీయమర్దన స్వామివార్ల తెప్పోత్సవాలు ఇందులోనే నిర్వహించేవారు. నిత్యపూజలు, అభిషేకాలకు ఈ నీటినే వాడేవారు. ఇక్కడ నీటి ఊటలు ఉండటంతో గుంటూరుకు ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది. ఉప్పు సత్యాగ్రహరం, క్విట్ ఇండియా ఉద్యమాల సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య పంతులు ఇక్కడే వేల మందితో పోరాట దీక్షాధారణ చేయించారు. ఇప్పుడు తెప్పోత్సవంతో పూర్వవైభవం సంతరించుకుంటోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కోనేరులో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.