Pulasa Fish Rate in Godavari District : గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప, ఏటికి ఎదురీదుతూ ఏ చేపకూ లేని ప్రత్యేకతనూ, రుచిని సంతరించుకున్నదే పులస చేప. గోదావరి జిల్లాల్లో లభించే ఈ చేపను రుచి చూడటానికి మాంసాహార ప్రియులు అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటారు. గోదావరి వరద నీటిలో ఈ చేప దొరికితే చాలు, మత్స్యకారుల పంట పండినట్లే.
మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? : మాంసాహారం. అందులోనూ చేపల పులుసు అంటే నచ్చని వారుంటారా? ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరని వారంటూ ఉండరు. పులస కూర ఎప్పుడు రుచి చూడాలా అని మాంసాహార ప్రియులు ఎదురు చూస్తుంటారు. అందుకే 'పెళ్లాం పుస్తెలు అమ్మి అయినా సరే, పులస కూర తినాలనేది' గోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా ఓ నానుడి. అరుదుగా ఒకటీ రెండు లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు. మత్స్యకారుల వద్ద పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు. ఇది చదువుతుంటే మీకు కూడా పులస రుచి చూడాలనిపిస్తుందా? అలాగైతే గోదావరి జిల్లాల్లో పులస దొరికే సీజన్ ఇదే.
YUVA - చేపలపై యువ పరిశోధకుడి రీసెర్చ్ - వరల్డ్ జర్నల్స్‌లో కథనాలు - Young Man Research on Fishes
జాలర్ల గాలింపు : రుచిలో మేటిగా భావించే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు, ఇతర ప్రాంతాల వారికి సైతం అమితమైన ఇష్టం. గోదావరి జిల్లాల్లో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సీజన్లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుడికి పులస చేప వలలో చిక్కితే పంట పడినట్లే. రూ.వేలల్లో పలికే పులస కోసం జాలర్లు నిర్విరామంగా గాలిస్తుంటారు.
రుచి అమోఘం : మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలల్లో పులస చేపలు చిక్కుకుంటాయి. ఈ చేపల రుచి అమోఘంగా ఉండటంతో ధర కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. తాజాగా సుమారు కిలోన్నర బరువున్న చేప రూ.20 వేలకు పైగా ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న రేంజ్ ఏంటో తెలుస్తుంది. గోదావరికి వరద నీరు వచ్చిందంటే చాలు పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేప ఎప్పుడొస్తుందా అని భోజన ప్రియులు, ఆందులోనూ మాంసాహార ప్రియులు గుటకలేస్తుంటారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. పులస చేప వలకు చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక మత్స్యకారుడి వలలో సుమారు కేజీన్నర బరువు ఉన్న పులస చేప చిక్కింది. ఈ చేపను మాజీ సర్పంచి బర్రె శ్రీను రూ.24 వేలు పెట్టి కొన్నారు.