PUBLIC GRIEVANCE AT TDP OFFICE: తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన ప్రజావేదికకు వివిధ సమస్యలతో బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు అందచేశారు. బాధితుల నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
దివ్యాంగులకు 1992లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేసి బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆనందరావు వాపోయారు. పొలం అమ్ముతానని మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి తన దగ్గర నుంచి అడ్వాన్స్‌గా 12 లక్షలు తీసుకొని, ఇప్పుడు అగ్రిమెంట్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలానికి చెందిన వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో తన ఇంటిని తగులబెట్టిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళితే నిందితుల పక్షాన నిలిచిన పోలీసులు తనపైనే ఎదురు కేసులు పెట్టారని చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లెకు చెందిన రెడ్డప్ప వాపోయారు.
గుంటూరులో తాను కొనుగోలు చేసిన స్థలాన్ని వేరొకరి పేరుతో మార్చిన మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్‌కు చెందిన నవీన్ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో తాను కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా నారాయణరెడ్డి అనే వ్యక్తి వేధిస్తున్నాడని గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన పోకా నాగేంద్రమ్మ వాపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన కానిస్టేబుల్ పరీక్షాపత్రంలో తప్పుల కారణంగా తాము ఉత్తీర్ణుత సాధించలేదని, తమకు ఈవెంట్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు కోరారు.
తాను అరుదైన వ్యాధితో పోరాడుతున్నానని, మందులకు నెలకు రూ.20 వేలు అవుతున్నాయని విజయవాడ యనమలకుదురుకి చెందిన అనసూయ తెలిపారు. తాను 2016 నుంచి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని అన్నారు. దీనికి గుండె, ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని లేదంటే జీవితాంతం ముందులు వాడాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. ఈ మందుల కోసం నెలకి 20 వేల రూపాయలు అవుతున్నాయని చెప్పారు. తమకు సాయం చేయాలని కోరారు.
భూమి కబ్జా చేసేందుకు పంట ధ్వంసం - వైఎస్సార్సీపీ నేత అరాచకం
'తహసీల్దార్ లంచం తీసుకొని భూరికార్డుల్ని మార్చేశారు - న్యాయం చేయండి'
'ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశారు' - 'వీఆర్వోపై చర్యలు తీసుకోండి'