Protests at Vizianagaram Collector Office: విజయనగరం జిల్లా కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లింది. నెల్లిమర్ల జ్యూట్ మిల్ కార్మికులు, విద్యార్థులు, రజకులు, డప్పు కళాకారులు సమస్యలు పరిష్కరించాలని నినాదాలతో విజయనగరం కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చట్ట విరుద్ధంగా జ్యూట్ మిల్‌ను మూసేసి కార్మిక హక్కులను కాలరాస్తున్న నెల్లిమర్ల జ్యూట్ మిల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారులకు గాని, కార్మికులకు గాని చెప్పకుండా మిల్లును మూసేశారని తెలిపారు.
"కేవలం నోటీసులు వేసి, కార్మిక సంఘాలకు గానీ, ప్రభుత్వ అధికారులకు కనీసం తెలియనీయకుండా యాజమాన్యం మిల్‌ను మూసేసింది. నో వర్క్, నో పే విధానాన్ని యాజమాన్యం తనకు తానుగా అమలుచేస్తుంది. ఇది చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధమైన చర్య. కార్మిక చట్టాల ప్రకారం కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి". - వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రజక సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని రజకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రానివ్వకుండా చేసిన జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పునరుద్ధరించాలని, డప్పు కళాకారులు, చర్మ కారుల సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డప్పు కళాకారులకు ఇస్తున్న 4 వేల రూపాయల ఫించన్‌ను 5 వేలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
"దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో రజకులు బానిసలుగా పని చేస్తున్నారు. ఎన్ని ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం చిన్న చూపు చూస్తుంది. అధికారంలోకి వస్తే ఎస్సీ జాబితాలో చేర్చుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. తమ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలి". - సూర్యనారాయణ, రజక సంఘం నాయకుడు
"జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డప్పు కళాకారులకు కనీసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఉన్న భూమిని లాక్కోవడానికి చట్టాన్ని సవరణ చేశారు. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎన్ని సార్లు కోరినా దళితులకు గాని, డప్పు కళాకారులకు గానీ సెంటు భూమి కూడా ఇవ్వలేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు డప్పు కళాకారులకు మూడు వేల రూపాయల పింఛను ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛను రూ. 5 వేలుకు పెంచాలి. సీఎం చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారం డప్పు కళాకారులకు డప్పులు, గజ్జెలు, బట్టలు ఇవ్వాలి. దళితులకు భూమితో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. చర్మకారులకు పనిముట్లు అందించాలి". - రాకోటి రాములు, డప్పు కళాకారులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు
"పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 ను తీసుకొచ్చింది. యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా జీవో గురించి మాట్లాడకపోవడం బాధాకరం. జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం". - ఏబీవీపీ నాయకుడు
రైతులకు మొండి చెయ్యి చూపించిన వ్యాపారులు - రూ.3.40 కోట్లు బకాయి - FARMERS PROTEST FOR CROP CASH