Protest to YS Bharathi : ముఖ్యమంత్రి జగన్‌కు సొంత నియోజకవర్గం పులివెందులలోనే చుక్కెదురైంది. ఆయన సతీమణి భారతి ఎన్నికల ప్రచారంలో సొంతపార్టీ నేతలే నిలదీశారు. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు.
YS Bharathi Election Campaign in Pulivendula : పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరరెడ్డి ఆమెకు విజ్ఞప్తితో కూడిన ప్రశ్నల వర్షం కురిపించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16 వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదేనని, దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. భాస్కరరెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనంగా విని వెళ్లిపోయారు.