Mutton Sales In Telangana : మన తెలంగాణలో చికెన్, మటన్ ముక్కకు ఫుల్ క్రేజ్. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే. మరి ఆ ముక్కకు ముద్ర ఉందా? ముక్క తెలుసు కానీ, ముద్ర ఏంటని ఆలోచిస్తున్నారా? మనం తినే మాంసం మంచిదేనా? అని తెలియాలంటే ముక్కకు ముద్ర ఉండాల్సిందే.
చాలా మంది నాన్‌వెజ్ ప్రియులకు మాంసం లేనిదే ముద్ద దిగదు. నాకు మంచి మేక మాంసం కావాలి. మేకపోతు మాంసం కావాలంటూ కావాల్సింది అడిగి మరీ దగ్గరుండి కొట్టించుకు వెళ్తుంటారు. మరి అసలు అక్కడ అడిగిందే ఇస్తున్నారా? ఆరోగ్యంగా ఉన్న మాంసాన్నే కోశారా? ఇదంతా ఎలా తెలుసుకోవాలి? కొన్నామా, తిన్నామా కాదు. తినే మాంసం పట్ల అలసత్వం వహిస్తే ఆరోగ్యానికే ప్రమాదం. ఇన్ని ప్రశ్నల నడుమ తినే మాంసం మంచిదని ముద్ర వేసుకుని మనశ్శాంతిగా తింటే మంచిది కదా.
మాంసం విక్రయాల్లో నిబంధనలు : మాంసం వ్యాపారులు విక్రయాల్లో నిబంధనలు పాటించడం లేదు. జీవాలు ఆరోగ్యమైనవేనా? లేదా? ధ్రువీకరించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశు సంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించాలి. వీరి పర్యవేక్షణలో వధించిన మాంసంపై ముద్ర (రౌండ్ సీల్) వేసినది మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. తెలంగాణలో నిత్యం క్వింటాళ్ల కొద్దీ మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ అధికారులు ఎక్కడా తనిఖీలు చేయట్లేదు. దీంతో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి.
సగానికిపైగా వ్యాపారులు ఇళ్లు, దుకాణాల వద్దనే వధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగాల బారినపడినవి, వయసు పైబడిన వాటిని కూడా వధించి విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాలనీల్లోని ఇళ్ల మధ్య ఈ తంతు జరుపుతుండటంతో అపరిశుభ్రతతో పాటు దుర్వాసన భరించలేకపోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
లైసెన్సు కలిగిన దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయించాల్సి ఉన్నా, పట్టణాలలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన, మురికి కాలువల పక్కన అమ్ముతున్నారు. రోజురోజుకూ ఇలాంటి దుకాణాలు పెరిగిపోతున్నా, వీటిపై అధికారుల అజమాయిషీ కనిపించడం లేదు. ధరల వివరాల పట్టికను దుకాణాల ఎదుట ప్రదర్శించాల్సి ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా దుకాణాలు అపరిశుభ్రత వాతావరణంలోనే కొనసాగుతున్నాయి.
మాంసం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మాంసం తీసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాటినే విక్రయిస్తున్నారా అని తెలుసుకొని తీసుకోవాలి.
- మాంసంపై అధికారులు ముద్ర (రౌండ్ సీల్) వేసినది మాత్రమే విక్రయించాలి.
- ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మటన్‌ను అస్సలు కొనొద్దు.
- మురుగు కాలువల దగ్గర్లో ఉన్న దుకాణాల్లో మాంసం తీసుకోవద్దు.
- అపరిశుభ్రత వాతావరణంలో ఉన్న షాపుల్లో మాంసం విక్రయించవద్దు.
- మాంసాన్ని తూకం వేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి.
- మాంసంపై అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
కిలోకు 800 గ్రాములే ఇస్తున్నారట - మాంసం ప్రియులారా కాస్త చూసుకొని తీసుకోండి