Precautions For Setting Up New Aquarium At Own Home : ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మన మనసుకు కాస్త ఉపశమనం కలిగేది గృహసీమలోనే. ఎవరైనా సరే ఒత్తిడిని అధిగమించాలంటే ముందు మనసుకు తగినంత విశ్రాంతి అవసరం. ఇందుకోసం మన ఇంట్లో ఉండే అక్వేరియం (చేపల పెట్టె) దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఈదులాడే రంగురంగుల చేపలను కొద్దిసేపు అలాగే చూస్తే మన మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. తద్వారా మనలో రక్తపోటు తగ్గుతుందని నిపుణులు అంటారు. ఈ కారణంగానే అక్వేరియాలపై నగరవాసుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
కొందరైతే తమ ఇంట్లో పెద్దపెద్ద అక్వేరియంలను ఏర్పాటు చేసుకొంటున్నారు. చాలా మంది వ్యక్తిగత నివాసాలు, డూప్లెక్స్, విల్లాల్లో సాధారణంగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అలాగే చోటు చాలని చిన్న ఇళ్లలో చిన్నపాటి గాజు పాత్రల్లో ఈ చేపలను పెంచుకుంటున్నారు. అచ్చం సముద్రపు లోతుల్లో ఉన్న అందచందాల నమూనాలను ఈ అక్వేరియంలో సృష్టించి రంగురంగుల చేపలను పెంచుతుంటారు. ఇందులో విభిన్న జాతులకు చెందిన చేపల సందడి కనువిందు చేస్తుంటుంది. ఈ చేపలకు క్రమం తప్పకుండా ఆహారం వేయడం, అలాగే ఇన్‌ఫెక్షన్ సోకకుండా మందులు, ఆక్సిజన్ అందే ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో నియమాలను పాటిస్తే ఈ అక్వేరియంలతో ఇంటికి అందం చేకూరడంతోపాటు మనసుకు హాయిని కలిగించే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- మనకు ఎండ, వేడి తగలకుండా కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఏర్పాటు చేసుకున్నట్లే, చేపలకు కూడా చల్లటి వాతావరణం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉన్నప్పటికీ ఎండ వేడిమి ప్రభావం వాటిపై ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- చేపల పెట్టెలో కొందరు బోరు నీరు, అలాగే ఇతరత్రా నీటిని ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా శుభ్రమైన ఫిల్టర్ నీటిని ఉపయోగించటం మంచిది. దీనివల్ల సహజ నీటిలో ఉండే అమ్మోనియా, నైట్రేట్ పోషకాలు అధిక మొత్తంలో కాకుండా సమపాళ్లలో చేపలకు అందే అవకాశం ఉంటుంది.
- వేసవిలో అక్వేరియంలోని నీటిని రోజూ మారుస్తుండాలి. సాధారణ రోజుల్లో అయితే వారం, పది రోజులకోసారి మార్చినా సరిపోతుంది. దీనివల్ల ఆ చేపలు కొత్త నీటిని ఆస్వాదిస్తాయి. అలాగే వాటి శరీరం చల్లగా ఉండేందుకు సాయపడుతుంది. సాయంత్రం సమయంలో ఈ నీటిని మారిస్తే మంచిది.
- అక్వేరియంలలో ఉండే చేపల కోసం తప్పకుండా ఎయిర్ పంప్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల అందులో ఉండే చేపలకు నిరంతరం ఆక్సిజన్ అందుతుంది. అయితే కొన్ని రకాల పెట్టెల్లో మాత్రం ఈ సౌకర్యం ఉండదు.
- కొందరు అక్వేరియం అందం కోసం రంగు రంగుల లైట్లను ఏర్పాటు చేస్తారు. అలాగే పెద్ద అక్వేరియాల్లో ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో వేసవి కాలంలో నీరు మరింత వేడిగా మారుతుంది. కాబట్టి పగలు లైట్లను ఆర్పేయడం మంచిది. అవసరం అనుకుంటే రాత్రి సమయంలో వెలిగించుకోవచ్చు.
- ఇంట్లో కిటికీలను తెరచటం వల్ల బయటి వేడిగాలి చేపల పెట్టెకు తగిలే అవకాశం ఉంది. దీంతో అక్వేరియంలోని చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోని కిటికీలను మూసి ఉంచాలి. అలాగే అక్వేరియంను చల్లటి ప్రదేశంలో పెట్టాలి.
- బయట దోరికే చిన్న సైజు క్లిప్ ఫ్యాన్స్‌ను ఉపయోగించి అక్వేరియంను చల్లగా ఉంచే ప్రయత్నం చేయవచ్చు. అంతేగాక చేపల పెట్టెలో ఉండే ఫిల్టర్‌లను తరచూ శుభ్రం చేయాలి.
- అక్వేరియం పరిమాణాన్ని బట్టే అందులో సరిపడే చేపలనే ఉంచాలి. ఎక్కువ సంఖ్యలో చేపలను ఉంచడం వల్ల నీరు పాడవడంతోపాటు అక్వేరియం వేడి పెరుగుతుంది.