Prathipati Pullarao Son Sharat in Police Custody : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. శరత్‌పై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. సీపీ కార్యాలయానికి వచ్చిన గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు చేరుకున్నారు. పోలీసులు సీపీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు.
ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తమ అబ్బాయిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురద జల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదన్నారు ప్రత్తిపాటి. ఈరోజు స్టేట్‌మెంట్ కోసం అని పిలిచి అదుపులోకి తీసుకున్నారని, వెంటనే అధికారపక్షం అనుకూల మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, చట్టపరంగానే దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
చిలకలూరిపేటలో తనపై పోటీకి వైఎస్సార్సీపీకి ధీటైన అభ్యర్థి దొరకట్లేదని, ఎన్నికలకు ముందే తన గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో మంత్రి రజిని వైఫల్యాలే వైఎస్సార్సీపీ ఓటమికి బాటలు పరిచాయని తెలిపారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకి ముందే గెలుపు ఖాయమే బలమైన స్థాయికి చేరుకున్నామని, ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ కేసుల రాజకీయానికి తెగబడ్డారన్నారు. ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. తమ కుమారుడికి కనీసం ముందస్తు నోటీసులు కూడా లేకుండా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున తనకు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే ఏపీఎస్‌డీఆర్ఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.
ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టుపై చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టులతో వేధిస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. చిలకలూరిపేటలో జాతీయ రహదారిపై పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. విచారణ పేరుతో పిలిచి, కనీసం నోటీసులు ఇవ్వకుండా శరత్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కుట్ర రాజకీయాలు మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే శరత్‌ను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులతో కుమ్మక్కై అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావును ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. శరత్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని పేర్కొన్నారు.