Prakasam Barrage Overflowing Floods in Krishna River Basin: కృష్ణా నది పరివాహకంలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు మించి నీరు దిగువకు విడుదలవుతోంది. మొత్తం 70 గేట్లను తెరిచారు. 60 గేట్లు నుంచి ఏడు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తుంటే 10 గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. కేఈబీ, రైవస్, బందరు కాల్వలకు 13,768 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు.
ఆ తర్వాత అనూహ్యంగా వరద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వచ్చిన నీటిని వచ్చినట్లేగానే దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర నుంచి శ్రైశైలం వరకు ఎగువ అన్ని జలాశయాల్లోను నీటి నిల్వ సామర్ధ్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి 215.81 టీఎంసీల నీరు నిల్వ సామర్ధ్యానికి 203.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు 4లక్షల 2 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ వద్ద 312.05 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యానికి 296.28 టీఎంసీల నీరు చేరింది. సాగర్ నుంచి 2,70,000 వేల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వదిలారు.
పులిచింతల వద్ద 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుతం 33.56 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3,71000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద అదే పరిమాణంలో నీటిని దిగువకు పంపిస్తున్నారు. గత రెండు రోజులతో పోలిస్తే నీటి విడుదల పరిమాణం ఎక్కువైంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
సెల్ఫీలతో సందడి: కృష్ణమ్మ జల సవ్వడి చెవులారా వినేందుకు కనులారా నీటి ఉధృతిని తిలకించేందుకు జలదృశ్యాన్ని తమ మదిలోనూ చరవాణిల్లోనూ బంధించేందుకు ఎక్కువ మంది సందర్శకులు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఎండ తీవ్రత లేకుండా ఓ మోస్తరు చల్లని వాతావరణం ఉండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద సందడి నెలకొంది. బ్యారేజీ నుంచి దివిసీమ వరకు నీరు వెళ్లి బంగాళాఖాతంలో కలవనున్నందున మధ్యలో వరదల వల్ల పంటలకు నష్టం కలిగించకుండా ఉండేలా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పాములలంక తదితర లంక గ్రామాల్లోకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగించినా నష్ట తీవ్రత మాత్రం అంతగా లేదని అధికారులు పేర్కొన్నారు.
దుర్గమ్మ చెంతన కృష్ణమ్మ పరవళ్లు - ఆకట్టుకుంటోన్న నదీతీరం - Krishna River Flood Flow
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన - Prakasam Barrage