Prakasam Barrage Damage Gates Repair Work Started : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు చేస్తున్నారు. బ్యారేజ్ 68, 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. పలు విభాగాల నిపుణులు బ్యారేజీపై ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు.
ఏడు రోజుల్లో పూర్తి : బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతులు చేస్తోంది. అడ్వైజర్, రిటైర్డ్ ఇంజినీర్ కేవీ కృష్ణారావు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తదితరులు బ్యారేజీపై ఉండి మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజీ వద్ద ఇరుక్కున్న పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. తొలుత 67,69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగిస్తారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease
రంగంలోకి కన్నయ్యనాయుడు : అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడిన విషయం తెలిసిందే. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. బ్యారేజ్ వద్ద బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్ దెబ్బతినగా 67, 68, 69 పిల్లర్ల మధ్య ఐదు ఇసుక బోట్లు కొట్టుకొచ్చాయి. దీంతో నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు మెుదట రాష్ట్ర ప్రభుత్వం జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చింది. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి.
శాంతించిన కృష్ణమ్మ : గత నాలుగు రోజులుగా జలవిలయం సృష్టించిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోంది. నీటిమట్టం మూడు లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరకు తగ్గింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.