PRAKASAM BARRAGE BOATS INCIDENT: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపునకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు బెకెం సంస్థ ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన 4 ప్రధాన ప్లాన్లు విఫలమడంతో సరికొత్త ప్లాన్‌తో బోట్లు బయటకు తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఒక్కోటి 40 టన్నుల బరువుండి నదిలో ఇసుక డ్రించింగ్ చేసే రెండు భారీ ఇసుక బోట్లను ఇనుప గడ్డర్లతో అనుసంధానించిన ఇంజినీర్లు, వాటిని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు తీసుకువచ్చారు.
ఈ రెండు భారీ బోట్లు రెండూ కలసి 300 టన్నుల పైగా బరువును అవలీలగా లాగేలా గడ్డర్లును అమర్చారు. కృష్ణానదిలో బ్యారేజీ 67 గేటు వద్ద చిక్కుకున్న భారీ బోటుపైకి తీసుకు వచ్చి రెండు పడవల మధ్య భాగంలో గొలుసులు, రోప్‌లతో బలంగా కట్టారు. రెండు పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కుని వచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. గడచిన 6 రోజులుగా 4 రకాల ప్లాన్లు ప్రధానంగా ఇంజినిర్లు అమలు చేయగా అన్నీ విఫలమయ్యాయి.
తొలుత వంద టన్నుల బరువు ఎత్తే రెండు భారీ క్రేన్లతో బోట్లకు కట్టి ఎత్తే ప్రయత్నం చేయగా విఫలమైంది. డైవింగ్ టీంలతో బోటును రెండు భాగాలుగా కోసి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. భారీ పడవలను వెలికి తీయడంలో అనుభవం ఉన్న, కాకినాడకు చెందిన అబ్బులు టీం రంగంలోకి దిగి భారీ పడవలకు రోప్‌లను కట్టి వెనక్కు లాగగా 20 మీటర్లు వెనక్కి వచ్చిలో ఇసుకలో చిక్కుకుని రాలేదు. ఆదివారం పొక్లయిన్కు రోప్‌లు కట్టి రోజంతా లాగినా కేవలం 5 మీటర్లు మాత్రమే కదిలి రాకుండా మెరాయించి ఆగిపోయింది. దీంతో ఈరోజు ప్లాన్ 5ను అమలు చేస్తున్నారు. ఎంతవరకు సఫలమవుతుందనే విషయం తేలనుంది. ప్లాన్ సఫలమైతే ఒకబోటును వెలికి తీయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకున్నాయి.
ఈ బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బులు బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమించింది. భారీ పడవకు ఇనుప రోప్ కట్టి ప్రొక్లెయిన్‌తో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కేవలం 20 మీటర్ల మేర మాత్రమే బోటు వెనక్కి కదలింది. నదిలో ప్రవాహం పెరగుతుండటంతో వాటి తొలగింపు కష్టంగా మారింది. నేడు మరో ప్లాన్‌తో అధికారులో ప్రయత్నాలు చేస్తున్నారు.
సవాల్‌గా మారిన బోట్ల వెలికితీత - బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE