Telugu Language Lover Krishna Surya Kumar: పర భాషల వ్యామోహంలో పడి తెలుగుకు తెగులు పట్టించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. నేటి తరానికైతే చాలా తెలుగు పదాలు తెలియదనడంలో ఎటువంటి అకతిశయోక్తి లేదు. ఏదైనా పదం చెబితే మాకు తెలీదని అదేదో గొప్పగా చెబుతారు. పిల్లలే కాదు పెద్దలు సైతం కన్నతల్లిలాంటి భాషను విస్మరించడంతో మరుగున పడే ప్రమాదం ఉంది. మాతృభాష చిన్నబోతోందని గుర్తించిన ఓ భాషాభిమాని తెలుగుకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాన్ని వారధిగా మలచుకుని తెలుగు పద్యాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. తనకు తెలిసిన విద్యను వందలాది మందికి నేర్పిస్తూ తెలుగు భాషాభివృద్ధికై పాటుపడుతున్నారు.
విశ్రాంత చిరుద్యోగి తపన: తెలుగు భాషను బతికించి భావితరాలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈయన పడుతున్న తపన వర్ణనాతీతం. భాషను పరిరక్షించేందుకు 76 ఏళ్లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్న ఈ పెద్దాయన తెలుగు ఉపాధ్యాయుడో లేక భాషా పండితుడో కాదు విశ్రాంత చిరుద్యోగి. గుంటూరుకు చెందిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గుమస్తాగా పని చేసేవారు. నానాటికీ తెలుగు తీసికట్టుగా మారుతోందని ఆవేదన చెందేవారు. ఎలాగైనా తెలుగును అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం తెలుగు పద్యాలపై అభిమానంతో పద్యరచన నేర్చుకున్నారు. తనకు తెలిసిన అంశాల్ని ఇతరులకు నేర్పడం ద్వారా తెలుగు భాషా వ్యాప్తికి తన వంతు సాయం చేయాలని సంకల్పించారు.
Telugu Language Day సొంత నేలపైనే అస్తిత్వ పోరాటం
''తెలుగు పద్యాలను కాపాడాలని పద్య రచనపై ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పాలని ఆయన సంకల్పించారు. అందుకు ఏకంగా సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకున్నారు. 2019 నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విభిన్న వృత్తి, వ్యాపారాల్లో ఉన్న భాషాభిమానులంతా సభ్యులుగా చేరారు. తెలుగు భాషకే మణిహారమైన పద్య రచనలో వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు. తెలుగులోని మెళకువలు, తెలుగు వనం, తెలుగు కావ్య మథనం పేర్లతో మూడు విభాగాలుగా శిక్షణను ఇస్తున్నారు. ఈయన దగ్గర తర్ఫీదు తీసుకున్న వారు పద్య రచనలో ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నారు'' -రాజశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
''తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాష, పద్య ప్రేమికులకు శిక్షణ అందించడం మాత్రమే కాదు వారు రాసిన పద్యాల్లో తప్పులు సరిదిద్దుతూ అందరిలో భాషా ప్రావీణ్యాన్ని పెంచుతున్నారు'' -పూసపాటి కృష్ణ సూర్యకుమార్, తెలుగు భాషాభిమాని
ఏడు పదుల వయసులోనూ పద్యానికి ప్రాణం పోస్తూ భావితరాల నోట పలికించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సూర్యకుమార్ దీక్షాదక్షత నేటి తరానికి మార్గదర్శనం. ఇలాంటి మరింత మంది భాషాభిమానులు చేరి తెలుగు సమాజాన్ని ఓ చోటికి తీసుకురాగలిగితే అందరిలో తెలుగు తనాన్ని ఇనుమడింపజేయవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Telugu Language Day Wishes: 'తెలుగు భాషను, తెలుగు జాతిని కాపాడుకుందాం
'తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు- 'మన్ కీ బాత్'లో ప్రత్యేక ప్రస్థావన - PM Narendra Modi Wishes