Poor Food for Patients : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఆస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామని రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెగ డప్పు కొడతారు. నిజానికి ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం నాణ్యమైన భోజనమూ అందడం లేదు. గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వాసుపత్రే ఇందుకు నిదర్శనం. ఇక్కడ పెట్టే నాసిరకం భోజనం తినడంతో కొత్త రోగాలు వస్తాయేమో అని రోగులు ఆందోళన చెందుతున్నారు.
Government Hospitals Food Issue : రాష్ట్రంలో తెనాలిలో మాత్రమే 300 పడకలున్న ప్రభుత్వాసుపత్రి ఉంది. దీని నిర్వహణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీతో పాటు మాతా శిశు ఆరోగ్య సేవల కోసం సుదూర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు వెయ్యి నుంచి 12 వందల మంది ఓపీ పేషెంట్లు వస్తుండగా 130 నుంచి 150 మంది చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరుతుంటారు. వారిలో ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలతో పాటు వృద్ధులే ఉంటున్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగులు ఇక్కడ పెట్టే భోజనాన్ని తలుచుకుని వణికిపోతున్నారు. నీళ్ల చారు, పలుచని మజ్జిగ, చాలీచాలని అన్నం, నాణ్యత లేని కూరలు తినలేక అవస్థలు పడుతున్నారు.
పార్వతీపురం జిల్లా ఆస్పత్రి పనులు నత్తనడక - రోగులకు తిప్పలు
Poor Food for Patients in AP : నెలకు సుమారు 4 వేల మంది సాధారణ డైట్ తీసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన ఏడాదికి సుమారు 50 వేల మందికి ఆహారం అందిస్తున్నారు. కానీ ఆస్పత్రిలో ప్రదర్శించే మెనూకీ రోజూ పెట్టే ఆహారానికి ఏ మాత్రం పొంతన ఉండట్లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో తినలేక హరేకృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్వంలో ఉచితంగా పెట్టే భోజనాన్నే తాము తిని, తమ వారికి తీసుకెళ్తున్నామని రోగుల బంధువులు చెబుతున్నారు. మరికొంత మంది ఇంటి నుంచి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్య వాణి మాత్రం అంతా సక్రమంగా జరిగేలా చూస్తామంటూ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన బకాయిలు- బయట నుంచి ఆహారం తెప్పించుకుంటున్న పేషంట్లు
ప్రస్తుతం ఆస్పత్రిలో సాధారణ డైట్ కింద రోగులకు 40 రూపాయలకు ఉదయం అల్పాహారం, రెండు పూటల భోజనం పెడుతున్నారు. ఇంత తక్కువ మొత్తంతో నాణ్యమైన భోజనం అందించలేమన్నది నిర్వాహకుల మాట. ప్రభుత్వం సాధారణ రోగులకు 80 రూపాయలు, ఇతరులకు 100 రూపాయలుగా ధర నిర్ణయించింది. అయితే కొత్తగా టెండర్లు పిలవకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో భోజన నిర్వాహకులు నాసిరకం ఆహారంతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకలి కేకలు.. చికిత్స మాత్రమే ఉచితం.. ఆహారం ఖర్చు రోగులదే