Political Leaders Condolence to MLA Lasya Nanditha : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి స్వర్గస్తులయ్యారన్న ఆయన, ఈ ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
లాస్య మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత, రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
లాస్య నందిత మృతిపట్ల లాస్య నందిత మృతిపట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి సంతాపం తెలిపారు. చిన్న వయసులో లాస్య నందిత అకాల మరణం బాధాకరమన్న భట్టి, లాస్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని మంత్రి జూపల్లి విచారం వ్యక్తం చేశారు. లాస్య కుటుంబసభ్యులకు శ్రీధర్‌బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత అకాల మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. లాస్యనందిత అకాల మరణం తీవ్ర విచారకరమన్నారు. ఆమె కుటుంబసభ్యులకు కేంద్రమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై.. తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందిన నందిత అకాల మృతి తీవ్ర బాధాకరం. ఏడాది క్రితం సాయన్న మరణం, ఇప్పుడు ఆయన కూతురు మృతి చెందడం విచారకరం. - రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర