Police Notice to YSRCP Central Office in Attack on TDP Office Case: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కుట్ర వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిందని టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచే వాహనాల్లో వచ్చారని కూడా అందులో పేర్కొన్నారు.
స్పందించని వైఎస్సార్సీపీ కార్యాలయం : అందుకే ఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ దృశ్యాల ఆధారంగా ఆ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన వారు, టీడీపీ కార్యాలయం పై దాడి చేసిన వారు ఎవరెవరనేది తేల్చనున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. కానీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు.
టీడీపీ ఆఫీస్‌పై దాడికేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
దేవినేని అవినాష్‌కు పోలీసుల నోటీసులు జారీ : అలాగే ఈ ఘటనలో బాధ్యులుగా ఉన్న వారికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడకు చెందిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌తో పాటు అరవ సత్యంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము అడిగిన వివరాలు అందజేయాలని నోటీసులలో పేర్కొన్నారు. గుణదలలోని ఆయన ఇంటికి అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దేవినేని అవినాష్ ఇటీవల విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నిందితులు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు.