Kamareddy ATM Theft Case Investigation : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం చోరీ ఘటనపై పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. తెరుచుకోకపోవడంతో దుండగులు ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
సీసీ ఫుటేజీలో దృశ్యాలు : మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్ వాహనంలో బిచ్కుందకు వచ్చారు. ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోలేదు. దీంతో ఆ యంత్రాన్ని తాళ్లతో తమ వాహనానికి కట్టి లాగారు. అనంతరం గది అద్దాల తలుపును ధ్వంసం చేశారు. ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ఏటీఎం దొంగిలిస్తున్న సమయంలో సైరన్ మోగింది. అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ, వారు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే దొంగలు ఏటీఎంతో పారిపోయారు.
'కనులు కనులను దోచాయంటే' సినిమాలోని ఏటీఎం చోరీ సీన్ రిపీట్ - చివరకు?
రూ.3.97 లక్షల నగదు నిల్వ : ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు సిబ్బందిం వెల్లడించారు. దొంగలు వినియోగించిన క్వాలిస్ను మహారాష్ట్ర సరిహద్దులో వదిలివెళ్లారు. ఈ క్వాలిస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్ చేరుకొని గుల్ల వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్ మండలం పెద్దఏడ్గి గ్రామంలో రెండు బైక్లను కూడా చోరీ చేశారని జుక్కల్ ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు. ఘటనపై నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. చోరీ చేసిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
మహారాష్ట్ర, కర్ణాటకకు పారిపోయినట్లుగా నిర్ధారణ : ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలు మహారాష్ట్ర లేదా కర్ణాటకకు పారిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దొంగల కోసం ఆయా రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టనున్నారు. బిచ్కుంద పట్టణంలో సీసీకెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. స్థానికులు ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా జిల్లాలో దోపిడీలకు పాల్పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ - రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు