Kukatpally Murder Case : ఓ మహిళను హత్య చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సంఘటనా స్థలాన్ని రేప్ సీన్‌గా మార్చిన ఓ కి'లేడీ'ని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు. ఈ సందర్భంగా మహిళ హత్య వివరాలను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేశ్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక (20) అనే మహిళ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. కేపీహెచ్బీలో ఉంటూ, రాత్రుళ్లు ఫుట్‌పాత్‌పై నిద్రించేది.
ఆభరణాల కోసం గొడవ : ఆ సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది. రోడ్డుపై ఉంటున్న తనకు భద్రత లేదని, తన వెండి ఆభరణాలను మంజుల వద్ద భద్రపరిచింది. కొద్ది రోజులకు తన వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని ప్రియాంక కోరగా, మంజుల వెనక్కి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియాంక మంజులతో నీ అంతు చూస్తానని బెదిరించి, వెండి ఆభరణాలు ఆమె నుంచి తిరిగి తీసుకుంది.
రేప్ చేసినట్లుగా చిత్రీకరణ : తనకు ప్రియాంకతో ప్రాణహాని ఉందని భావించిన మంజుల, ఆమెకు గత నెల 30వ తేదీన మద్యం తాగించి, కేపీహెచ్‌బీలోని లోథా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్లి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం ప్రియాంకను ఎవరో రేప్ చేసి, హత్య చేసినట్లుగా ఘటనా స్థలాన్ని చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యింది.
ఇటీవల ప్రియాంక మృతదేహం లభించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు దర్యాప్తులో ఈ తతంగమంతా బయటపడింది. హత్యకు పాల్పడిన కిలాడీ లేడీ మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రియాంక హత్య కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ సురేశ్ అభినందించారు.
"బోధన్ ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక (20) అనే మహిళ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చింది. కేపీహెచ్బీలో ఉంటున్న ఆమె రాత్రుళ్లు ఫుట్‌పాత్‌పై నిద్రించేది. ఆ సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆభరణాల విషయంలో గొడవ రావడంతో మంజుల, ప్రియాంకకు మద్యం తాగించి బ్లేడ్‌తో గొంతు కోసి చంపింది". - సురేశ్ కుమార్, డీసీపీ, బాలానగర్ జోన్